ఆ ఊరికి ఏమైందో!

18 Deceased Of Unknown Disease In Odisha - Sakshi

గుర్తు తెలియని వ్యాధితో 18 మంది మృతి

భయాందోళనలో గ్రామస్తులు 

జయపురం: గోరుచుట్టుపై రోకటిపోటులా తయారైంది ఆ గ్రామస్తుల పరిస్థితి. ఒక పక్క కరోనా మహమ్మారి భయకంపితులను చేస్తుండగా మరో పక్క వింత వ్యాధితో ప్రతిరోజూ గ్రామస్తులు అకస్మాత్తుగా మరణిస్తున్నారు. ఈ పరిస్థితి నవరంగపూర్‌ జిల్లా కొశాగుమడ సమితిలోని బొడొ అటిగాం గ్రామంలో దాపురించింది. గడిచిన  మూడు, నాలుగు రోజుల్లో  గ్రామంలోని 18  మంది వింత వ్యాధితో మృతి చెందారు. ఈ నేపథ్యంలో  గ్రామప్రజలు భయంతో వణికిపోతున్నారు. (చదవండి: దొరికాడ్రా కొడుకు, ఉతుకుడే ఉతుకుడు!)

వింత వ్యాధితో ఎప్పుడు ఎవరు  మరణిస్తారో తెలియని స్థితిలో ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమని ఉన్నారు.  వివరాలిలా ఉన్నాయి.  గ్రామంలో దాదాపు 760 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఇటీవల గ్రామంలో 18 మంది అకస్మాత్తుగా మరణించారని గ్రామస్తులు వెల్లడిస్తున్నారు. మరణించిన వారిలో ఒక ఏడాది లోపు వయసు వారు ముగ్గురు, 15 ఏళ్ల వయసు గల ఇద్దరు యువతులు, 25 నుంచి 35 ఏళ్ల  వయసు వారు ఏడుగురు, 40 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వయసు వారు ఆరుగురు మరణించారని గ్రామప్రజలు వెల్లడించారు. వారంతా మొదట జ్వరం వచ్చి తరువాత వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురై మరణించారని చెబుతున్నారు. వింతవ్యాధితో గ్రామస్తులు మరణించడం భయభ్రాంతులకు గురి చేస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

గ్రామానికి రాని వైద్యబృందం
అయితే గ్రామంలో వింత వ్యాధితో   18 మంది మరణించిన సమాచారం అధికారుల వద్ద  లేనట్లు తెలుస్తోంది. ఇంత జరుగుతున్నా ఆ గ్రామానికి వైద్యబృందం  రాక పోవడమే దీనికి తార్కాణంగా నిలుస్తోంది. గ్రామంలో మినీ హెల్త్‌ కేంద్రం మాత్రం ఉందని హెల్త్‌ వర్కర్లు ఎవరూ లేరని అదుచేత ఎటువంటి అనారోగ్యం వచ్చినా తమకు వైద్య సేవలు అందడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఈ విషయమై జిల్లా ప్రధాన వైద్యాధికారి (సీడీఎంఓ) శోభారాణి దృష్టికి తీసుకువెళ్లగా ఆ విషయం తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. వెంటనే ఒక వైద్య బృందాన్ని బొడొఅటిగాం  గ్రామానికి పంపి అక్కడి పరిస్థితులు తెలుసుకుంటామని చెప్పారు. అయితే ఒక గ్రామంలో 18 మంది మరణించినా అధికారులకు తెలియలేదంటే జిల్లాలో వైద్య విభాగం పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోందని పరిశీలకులు విస్తుపోతున్నారు.   

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top