పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయింపు
ములుగు : మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా శనివారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ సంపత్ రావు, జనరల్ అబ్జర్వర్ గంగాధర్ సమక్షంలో పోలింగ్ సిబ్బందికి రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను చేపట్టారు. అనంతరం పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా అనుసరిస్తూ ర్యాండమైజేషన్ ప్రక్రియ చేపట్టినట్లు వారు తెలిపారు. టీ–పోల్ పోర్టల్ ద్వారా ఎన్నికల విధులు నిర్వహించే 24మంది (పీఓలు) ప్రిసైడింగ్ అధికారులు, 24 మంది ఏపీఓలు, 72 మంది ఓపీఓలకు రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను పూర్తి చేసినట్లు వివరించారు. ములుగు మున్సిపాలిటీ పరిధిలో 20వార్డులకు సంబంధించి 20 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ మొత్తం పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వారు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ తన్నీరు రమేశ్, ఈడీఎం దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.
వార్షిక పరీక్షలకు
విద్యార్థులు సిద్ధం కావాలి
ములుగు రూరల్ : పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షలకు సిద్ధం కావాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్‌రెడ్డి సూచించారు. శనివారం మల్లంపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు ఇంగ్లిష్ లాంగ్వేజ్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇంగ్లిష్ సబ్జెక్ట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఇంగ్లిష్ సబ్జెక్ట్‌లో అధిక మార్కులు ఎలా సాధించాలో మెలకువలను విషయ నిపుణులు విద్యార్థులకు వివరించారు. కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు ఖలీల్, మాజీ అధ్యక్షుడు శ్యామ్ సుందర్‌రెడ్డి, ఏసీజీఈ వినోద్‌కుమార్, సూర్యనారాయణ, ఎంఈఓ తిరుపతి, ఝాన్సీ, ఆంగోత్ రాజు, వైష్ణవి, కృష్ణ, పద్మ, ఆదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పెరిగిన గోదావరి వరద
● నిలిచిన కరకట్ట పనులు
మంగపేట : మండలంలో గోదావరి వరద నీటి మట్టం పెరిగింది. దీంతో గోదావరి ఒడ్డు వెంట చేపట్టిన కరకట్ట నిర్మాణ పనులు నిలిచి పోయాయి. కన్నాయిగూడెం మండలంలోని తుపాకులగూడెం వద్ద గోదావరిపై నిర్మించిన సమ్మక్కసాగర్ బ్యారేజ్ ఎగువ ప్రాంతం నుంచి వరద ఇన్‌ఫ్లో పెరగడంతో శనివారం 4 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. దీంతో గోదావరిలో వరద నీరు క్రమంగా పెరగడంతో సాయంత్రం వరకు కరకట్ట బండ్ పనులు జరుగుతున్న ప్రాంతంలోకి వరద నీరు చేరింది. పొక్లెయినర్ల చుట్టూ సైతం నీరు చేరడంతోపాటు బండ్ నిర్మాణానికి వినియోగించే రాళ్లు కూడా నీట మునిగి పనులు పూర్తిగా నిలిచి పోయాయి. ఇదే విషయంపై ఇరిగేషన్ ఏఈ వలీమ్‌మహ్మద్‌ను వివరణ కోరగా గోదావరిలో నీటిమట్టం పెరగడం వల్ల తాత్కాలికంగా పనులకు అంతరాయం కలిగింది. వరదనీటి కారణంగా ఎలాంటి నష్టం జరుగలేదన్నారు.
14,503 క్యూసెక్కుల నీరు విడుదల
కన్నాయిగూడెం : జిల్లాలోని కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం గోదావరిపై నిర్మించిన సమ్మక్క సాగర్ బ్యారేజ్ నుంచి దిగువకు 14,503 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతం నుంచి 6,000 క్యూసెక్కుల ఉన్న నీరు శనివారం బ్యారేజ్‌లోకి ఒక్కసారిగా 14,750లకు వచ్చి చేరింది.
నేటినుంచి ఎరువుల బుకింగ్ ప్రక్రియ ప్రారంభం
ములుగు : జిల్లావ్యాప్తంగా ఎరువుల బుకింగ్ ప్రక్రియ (నేడు)ఆదివారం నుంచి ప్రారంభమవుతుందని జిల్లా వ్యవసాయ అధికారి సురేష్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఫర్టిలైజర్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఎరువులు బుక్ చేసుకోవాలని ఆయన రైతులను కోరారు. యాప్ డౌన్‌లోడ్‌లో గానీ, బుకింగ్ ప్రక్రియలో గానీ ఏమైనా సాంకేతిక సమస్యలు ఎదురైతే సంబంధిత ఏఓ, ఏఈఓలను సంప్రదించాలన్నారు. ములుగు–89777 51161, వెంకటాపూర్–89777 51162, మల్లంపల్లి–87124 99938, ఏటూరునాగారం–89777 51142, గోవిందరావుపేట–89777 51149, మంగపేట–89777 51151, కన్నాయిగూడెం–89777 51150, తాడ్వాయి–89777 51152, వెంకటాపురం–89777 51153, వాజేడు–89777 51152 నంబర్లలో ఆయా మండలాలకు చెందిన రైతులు సంప్రదించాలని కోరారు.
పోలింగ్ సిబ్బందికి విధులు కేటాయింపు


