ఇంటి నుంచే యూరియా బుకింగ్
రామాయంపేట(మెదక్): రైతులు శనివారం నుంచి ఫర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారానే యూరియా కొనుగోలు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి దేవ్‌కుమార్ సూచించారు. శుక్రవారం పట్టణంలోని ఏడీఏ కార్యాలయాన్ని సందర్శించారు. అనంతరం రైతులకు బుకింగ్ యాప్‌పై అవగాహన కల్పించారు. మొబైల్‌తో రైతులు తమ ఇంటి నుంచే యూరియా బుక్ చేసుకోవచ్చని వివరించారు. ఈ యాప్ ద్వారా జిల్లా పరిధిలో యూరియా స్టాక్‌ను స్వయంగా రైతులు తెలుసుకునే అవకాశం ఉంటుందన్నారు. బుకింగ్ చేసుకోవడానికి గాను భూమి పట్టాదారులు, కౌలు రైతులు, నాన్ పట్టాదారులు మాత్రమే అర్హులని స్పష్టం చేశారు. ఈమేరకు యూరియా బుక్ చేసుకున్న రైతులకు ఒక ప్రత్యేకమైన బుకింగ్ ఐడీ రూపొందించినట్లు పేర్కొన్నారు. సాగు విస్తీర్ణం ఆధారంగా రైతులు బుక్ చేసుకున్నా, అందుబాటులో ఉన్న స్టాక్‌ను బట్టి వారికి పంపిణీ చేస్తామన్నారు. ఆయన వెంట వ్యవసాయ సహాయ సంచాలకులు రాజ్‌నారాయణ, ఇతర అధికారులు, రైతులు ఉన్నారు.


