పుర పీఠం కాంగ్రెస్ కై వసం
బెల్లంపల్లి చైర్‌పర్సన్‌గా దావ స్వాతి, వైస్ చైర్మన్‌గా రాగంశెట్టి సత్యనారాయణ చైర్‌పర్సన్ ఎన్నికకు గైర్హాజరైన బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు ప్రత్యేక సమావేశానికి కాంగ్రెస్, బీజేపీ, ఇండిపెండెంట్ కౌన్సిలర్లు హాజరు
చెన్నూర్ మున్సిపల్ చైర్‌పర్సన్‌గా పెద్దింటి పద్మ వైస్ చైర్మన్‌గా నాయకపు వినయ్‌కుమార్
లక్సెట్టిపేట చైర్‌పర్సన్‌గా దొంత అంజలి వైస్ చైర్‌పర్సన్‌గా మోత్కూరి రాజేశ్వరి
బెల్లంపల్లి: బెల్లంపల్లి మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంది. పోటాపోటీగా చోటు చేసుకున్న పరిణామాల మధ్య ఎట్టకేలకు పట్టు సాధించి మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగురవేసింది. బెల్లంపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్‌గా 7వ వార్డు కౌన్సిలర్ దావ స్వాతి, వైస్ చైర్మన్‌గా 17వార్డు కౌన్సిలర్ రాగంశెట్టి సత్యనారాయణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. బెల్లంపల్లి మున్సిపల్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సోమవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మున్సిపల్ ప్రత్యేక అధికారి, సబ్ కలెక్టర్ మనోజ్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నెల 11న జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులను ఆహ్వానించారు. బీఆర్‌ఎస్ పార్టీ కౌన్సిలర్లు 14మంది గైర్హాజరు కాగా ఎక్స్ అఫీషియో సభ్యుడి హోదాలో ఎమ్మెల్యే గడ్డం వినోద్, కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు 14మంది, 1 బీజేపీ, ఐదుగురు స్వతంత్ర కౌన్సిలర్లు హాజరయ్యారు. ముందుగా మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికపై ప్రత్యేక అధికారి కౌన్సిలర్లకు వివరించారు. కాంగ్రెస్, స్వతంత్ర, బీజేపీ కౌన్సిలర్లు సామూహికంగా చైర్ పర్సన్, వైస్ చైర్మన్ పేర్లను ప్రతిపాదించి బలపర్చారు. సభ్యులు సంఘటితంగా చేతులు పైకెత్తి సంఘీభావం తెలిపారు. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో మరెవరూ పోటీలో లేకపోవడంతో మున్సిపల్ చైర్‌పర్సన్‌గా దావ స్వాతి, వైస్ చైర్మన్‌గా రాగంశెట్టి సత్యనారాయణ ఎక్స్‌అిఫీషియో సభ్యుడితో కలుపుకొని 21మంది సభ్యుల మద్దతుతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రత్యేక అధికారి మనోజ్ ప్రకటించారు. అంతకుముందు కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎన్నిక అనంతరం చైర్‌పర్సన్, వైస్ చైర్మన్‌కు ఎంపిక పత్రాలను అందజేశారు. చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం మహారాష్ట్రలోని చంద్రపూర్‌లో నిర్వహించిన ప్రత్యే క క్యాంపు నుంచి ప్రైవేట్‌బస్సులో నేరుగా ఉదయం 10:30 గంటల ప్రాంతంలో మున్సిపల్ కార్యాలయానికి సభ్యులు చేరుకున్నారు.
చేజారిపోకుండా విప్ జారీ..
మున్సిపల్ చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో అధికార కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు ప్రత్యర్థి పార్టీకి మద్దతు ఇవ్వకుండా ముందస్తుగా విప్ జారీ చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్ కాంగ్రెస్ పక్షాన విప్ జారీ చేశారు. ఈ మేరకు మహేష్‌కుమార్‌గౌడ్ విప్ జారీ చేసినట్లు ప్రత్యేక అధికారి మనోజ్ కౌన్సిలర్లతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో వెల్లడించారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ జే.సంపత్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
రాగంశెట్టి సత్యనారాయణ
దావ స్వాతి
ఇద్దరూ మహిళలే..
లక్సెట్టిపేట: మున్సిపల్ కార్యాలయంలో నూతన కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం సోమవారం ఘనంగా ముగిసింది. కార్యాలయం వద్ద సీఐ రమణామూర్తి, ఎస్సై గోపతి సురేష్, పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. మున్సిపల్ పరిధిలోని పదిహేను వార్డుల్లో కాంగ్రెస్ 11, బీఆర్‌ఎస్ 3, బీజేపీ 1 స్థానం గెలుచుకుంది. ఎన్నికల ప్రత్యేకాధికారి దిలీప్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ విజయ్‌కుమార్, మేనేజర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో కౌన్సిల్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆయా పార్టీల సభ్యులు 10గంటలకే క్యాంపు నుంచి నేరుగా కార్యాలయానికి హాజరయ్యారు. ముందుగా కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు. 12:30గంటలకు చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక చేపట్టారు. చైర్‌పర్సన్‌గా 2వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ దొంత అంజలిని 15వ వార్డు కౌన్సిలర్ గోప సుజాత ప్రతిపాదించగా, 6వ వార్డు కౌనిల్సర్ తోట సువర్ణ బలపరిచింది. వైస్ చైర్‌పర్సన్‌గా కౌనిల్సర్ మోత్కూరు రాజేశ్వరిని కౌన్సిలర్ సూరం చంద్రమౌళి ప్రతిపాదించగా కౌన్సిలర్ బిరుదుల సత్యనారాయణ బలపరచారు. సభ్యులందరూ చేతులు పైకెత్తి మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. వారిద్దరితో ఎన్నికల ప్రత్యేకాధికారి దిలీప్ కుమార్ ప్రమాణ స్వీకారం చేయించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం కృషి చేసిన ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్‌రావు, అతడి తమ్ముడు కొక్కిరాల సత్యపాల్‌కు సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఘనంగా సంబురాలు..
మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం చై ర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ల ఎంపిక ప్రక్రియ పూర్తి కావడంతో స్థానిక పాతబస్టాండు నుంచి కార్యకర్తలతో శోభాయాత్ర నిర్వహించి టపాసులు కాల్చి సంబురాలు చేసుకున్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దొంత అంజలి
మోత్కూరి రాజేశ్వరి
బలపరుస్తున్న కౌన్సిలర్లు


