క్యాతనపల్లిలో ‘కుర్చీ’లాట !
వాయిదా పడడంతో మారుతున్న సమీకరణాలు
చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో నాటకీయ పరిణామాలు
ధర్నా నిర్వహించిన బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్
సాక్షి ప్రతినిధి, మంచిర్యాల/రామకృష్ణాపూర్: క్యాతనపల్లి మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్నిక కాక రేపుతోంది. బీఆర్‌ఎస్ పట్టు బిగించడం, అధికార కాంగ్రెస్ పార్టీ అవకాశం కోసం ఎదురు చూస్తుండడంతో పరిమాణాలు రసవత్తరంగా మారుతున్నాయి. సోమవారం కౌన్సిల్ సభ్యుల ప్రమాణ స్వీకారం, చైర్‌పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక కోసం అధికారులు సమావేశం ఏర్పాటు చేశారు. సమయానికి ఎవరూ హాజరు కాలేదని మందమర్రి తహసీల్దార్, ఎన్నికల ప్రత్యేక అధికారి సతీష్‌కుమార్ ఉన్నతాధికారుల సూచనతో ఎన్నికను మంగళవారానికి వాయిదా వేశారు. కాగా, ఉదయం 11గంటలకు ప్రమాణ స్వీకారానికి బీఆర్‌ఎస్, సీపీఐ కౌన్సిలర్లు క్యాతనపల్లిలోని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం నుంచి బయల్దేరారు. ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వారి వాహనాలను అడ్డుకున్నారు. అభ్యర్థులు మాత్రమే వెళ్లాలంటూ ఇతరులను నిలిపి వేయడంతో బీఆర్‌ఎస్, సీపీఐ నాయకులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నాయకులను అనుమతించి తమను అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బాల్క సుమన్ తీవ్రంగా ఆక్షేపించారు. మరోవైపు కాంగ్రెస్ ముఖ్య నాయకులు కొందరు మున్సిపల్ కార్యాలయం వెనుక భాగం ద్వారా చేరుకుని బీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విప్ జారీ చేసేందుకు తాను వస్తే పోలీసులు అడ్డుకుంటున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు రఘునాథ్‌రెడ్డి చెప్పుకొచ్చారు. గంటకు పైగా కాంగ్రెస్ నాయకులు కార్యాలయం గేటు ఎదురుగా కుర్చీల్లో కూర్చున్నా పోలీసులు వారిని పంపించకపోవడంపై బీఆర్‌ఎస్, సీపీఐ నాయకులు తీవ్ర విమర్శలు గుప్పించారు. బీఆర్‌ఎస్, సీపీఐ నాయకులు కొందరు కార్యాలయం వద్దకు చేరుకుని బైఠాయించారు. కావాలనే కాంగ్రెస్ నాయకులను అనుమతించి ఉద్రిక్తతలు సృష్టించారని, తద్వారా ఎన్నిక వాయిదా పడేలా చేశారని పోలీసుల తీరుపై బాహాటంగా విమర్శలు చేశారు. ఎన్నిక వాయిదా వేసినట్లు ప్రత్యేక అధికారి ప్రకటన అనంతరం పరిస్థితి శాంతించింది.
క్యాంపులోనే కౌన్సిలర్లు
మరోవైపు తెల్లవారితే ఏం జరుగుతుందోనని అటు బీఆర్‌ఎస్ క్యాంపు, ఇటు అధికార పార్టీలోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. ఏ కౌన్సిలర్ ఎటువైపు మొగ్గు చూపుతారనేది ఉత్కంఠ రేపుతోంది. మున్సిపల్‌లో మొత్తం 22స్థానాలు కాగా, చైర్‌పర్సన్ పీఠం దక్కాలంటే మ్యాజిక్ ఫిగర్ 12కు చేరుకోవాలి. బీఆర్‌ఎస్ 10, సీపీఐ 4స్థానాలు కై వసం చేసుకుంది. ఏడు కాంగ్రెస్‌కు, స్వతంత్ర కౌన్సిలర్ ఒకరు ఉన్నారు. వీరిలో స్వతంత్ర కౌన్సిలర్ కాంగ్రెస్‌లో చేరారు. వీరికి తోడు ఎక్స్‌అఫీషియో సభ్యులుగా ఎంపీ వంశీక్రిష్ణ, ఎమ్మెల్యే, మంత్రి వివేక్ క్యాతనపల్లిలోనే ఓటు హక్కు నమోదు చేసుకున్నారు. దీంతో మరో ఇద్దరు సభ్యులైతే అధికార పార్టీకి అవకాశం వస్తుంది. సీపీఐతో పొత్తు పెట్టుకుని వ్యూహాత్మకంగా ఎన్నికలకు వెళ్లిన బీఆర్‌ఎస్ 14మంది కౌన్సిలర్లను ఫలితాలు వెలువడే సమయం నుంచే అప్రమత్తమై ప్రత్యేక క్యాంపులకు తరలిచింది. కమ్యూనిస్టులు బలంగా ఉన్న భద్రాచలం వెళ్లగా, చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నిక కోసం ఆదివారం రాత్రి చేరుకున్నారు. ప్రస్తుతం బీఆర్‌ఎస్–సీపీఐకి చెందిన 14మంది కౌన్సిలర్లు స్థానికంగా క్యాంపులో ఉన్నట్లు సమాచారం. మంగళవారం ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా సాగుతుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ నెలకొంది.


