రాష్ట్రపతి నిలయంలో నృత్యప్రదర్శన
జన్నారం: హైదరాబాద్ రాష్ట్రపతి నిలయంలో ని కళాసంధ్య ప్రాంగణంలో నిర్వహించిన సాంస్కృతిక మహోత్సవ కళావైభవంలో మండల కేంద్రానికి చెందిన నటరాజ కళాక్షేత్రానికి నృత్య ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించింది. శివరాత్రి పర్వదినం సందర్భంగా ఆదివారం రాత్రి నిర్వహించిన కళావైభవం వేదికపై నాటరాజ కళాక్షేత్రం జన్నారం, లక్సెట్టిపేట శాఖలకు చెందిన విద్యార్థులు అద్భుతంగా కూచిపూడి నృత్య ప్రదర్శన చేశారు. రాష్ట్రపతి నిలయంలో ప్రదర్శన ఇచ్చే అవకాశం లభించడం ఎంతో ఆనందంగా ఉందని కళాక్షేత్రం మాస్టర్ నర్మద గౌడ్ తెలిపారు. ప్రముఖుల చేతుల మీదుగా బహుమతులు అందుకోవడం మరిచిపోలేని అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.
పక్షులను వేటాడిన నలుగురికి రిమాండ్
పెంచికల్‌పేట్: ఎల్లూర్ బొక్కివాగు ప్రాజెక్ట్‌లో అరుదైన వలస పక్షులను వేటాడిన నలుగురిని రిమాండ్‌కు తరలించినట్లు పెంచికల్‌పేట్ రేంజ్ అధికారి అనిల్‌కుమార్ సోమవారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. నజ్రూల్‌నగర్ గ్రామానికి చెందిన ప్రొకాష్ సర్కార్, కుషాల్‌మండల్, తుషార్‌దే, తర్పాప్‌దార్ సంజిత్ లోడుపల్లి గ్రామంలో సెంట్రిగ్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరు చెరువులో అరుదైన పక్షులు సంచరిస్తున్నట్లు గమనించారు. ఈనెల 13న క్రిమిసంహారక మందు కలిపిన ధాన్యం చెరువులోని తామర ఆకులపై చల్లారు. విషపు ధాన్యం తిని చనిపోయిన అరుదైన 26 పక్షులను సంచుల్లో వేసుకుని అమ్మడానికి వెళ్తున్న క్రమంలో అటవీ అధికారులు పట్టుకున్నారు. చనిపోయిన పక్షులకు పశువైద్యాధికారి రాకేశ్ ఆధ్వర్యంలో పంచనామా నిర్వహించారు. వారి నుంచి రెండు ద్విచక్రవాహనాలు, నాలుగు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకుని కోర్టులో హాజరుపరచగా నిందితులకు 14రోజుల రిమాండ్ విధించారు. దాడుల్లో ఎఫ్‌ఎస్వో జగన్, ఎఫ్‌బీవోలు సతీశ్, సందీప్, లచ్చన్న, ఎనిమల్ ట్రాకర్ రాజు, సిబ్బంది వాజీద్ పాల్గొన్నారు.
సమస్యలు త్వరగా పరిష్కరించాలి
ఉట్నూర్‌రూరల్: ప్రతీ సోమవారం ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా సమస్యలు పరిష్కరించేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని ఐటీడీఏ పీవో యువరాజ్ మార్మాట్ సూచించారు. ఐటీడీఏ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణిలో వివిధ సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జైనూర్ మండలం గారింగగూడ గ్రామస్తులు తమ గ్రామానికి త్రీఫేజ్ విద్యుత్ సౌకర్యం కల్పించాలని వినతిపత్రం ఇచ్చారు. ఇంద్రవెల్లి మండలం కొలంగూడ గ్రామానికి చెందిన ముక్తా తనకు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్ అందించాలని దరఖాస్తు చేసుకున్నాడు. గాదిగూడ మండలం జరి గ్రామానికి చెందిన జంగు ఆర్థికసహాయం అందించాలని అర్జీ అందించారు. అలాగే, వివిధ ప్రాంతాల నుంచి బాధితులు వచ్చి పింఛన్, ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా, స్వయం ఉపాధి పథకాలు మంజూరు చేయాలని వినతిపత్రాలు అందజేశారు. పలువురు వ్యవసాయ, రెవెన్యూ శాఖలకు సంబంధించిన సమస్యలు పరిష్కరించాలని దరఖాస్తులు ఇచ్చారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
రాష్ట్రపతి నిలయంలో నృత్యప్రదర్శన
రాష్ట్రపతి నిలయంలో నృత్యప్రదర్శన


