వరి పొట్ట దశలో జాగ్రత్తలు పాటించాలి
చెన్నూర్‌రూరల్: యాసంగి సీజన్‌లో వరి సాగు చేసిన రైతులు పొట్టదశలో జాగ్రత్తలు తీసుకుంటే అధిక దిగుబడులు సాధించవచ్చని చెన్నూర్ ఏడీఏ బానోతు ప్రసాద్ తెలిపారు. వరిలో పొట్ట దశ చాలా కీలకమని, జాగ్రత్తలు పాటించకుంటే దిగుబడిపై ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయన్నారు. పొట్ట దశలో కాండం తొలుచు పురుగు, ఆకు ముడత పురుగులు ఆశిస్తే దిగుబడులు గణనీయంగా తగ్గుతాయన్నారు. ఈ పురుగులు సోకినట్లు గుర్తిస్తే నత్రజని ఎరువుల వాడకం పూర్తిగా నిలిపి వేయాలని, తెగులు సోకిన పొలం నుంచి ఇతర పొలానికి నీరు వెళ్లకుండా జాగ్రత్త పడాలని సూచించారు. రెండు నుంచి మూడు రోజులపాటు చేనును ఆరబెట్టిన తర్వాత ఎకరాకు 20 కిలోల మ్యూరేట్ పొటాష్ చల్లాలన్నారు. ఎకరాకు 500ల గ్రాముల సూడోమోనాస్ ఫ్లోరో సెన్స్ శిలీంద్రాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి సాయంత్రం సమయంలో మాత్రమే పంటపై పిచికారి చేస్తే కొన్ని రకాల పొడ తెగుళ్లు, అగ్గి తెగుళ్లు, పొట్ట కుళ్లు తెగుళ్లను అరికట్ట వచ్చని ఆయన వివరించారు.
కాండం కుళ్లు తెగులు నివారణకు చర్యలు
కాండం కుళ్లు తెగులు నివారణకు లీటరు నీటికి వాలిడామైసిన్ 2 మి.లీ చొప్పున కలిపి పిచికారీ చేయాలి. ఈ దశలో సూటి ఎరువులను వాడకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. చిరు పొట్ట దశలో కాంప్లెక్స్ ఎరువులు వేస్తే సుడి దోమ ఆశించే అవకాశం ఉంది. కాబట్టి ప్రతీరోజు వరి పైరును గమనించి దుబ్బుకు 20కి మించిన సుడి దోమలు కనిపిస్తే నివారణ చర్యలు తీసుకోవాలి. పంట చేలో ఉన్న నీటిని బయటకు తీసి ఎకరాకు ఫెనుబ్యూకార్బ్ 400 మి.లీ 200 లీటర్ల నీటిలో కలిపిన దావ్రణం వరి దుబ్బు మొదళ్లలో పడేలా పిచికారీ చేయాలి. వరిలో ఎలుకల ఉధృతి నివారించేందుకు బ్రోమోడయోలిన్ వంటి విషపు ఎర, లేదా బుట్టలు, పొగ యంత్రాల ద్వారా ఎలుకల కన్నాల్లోకి పొగ బారించాలి. పై పద్ధతులు పాటిస్తే వరిలో మంచి దిగుబడులు సాధించవచ్చని ఆయన సూచించారు.
వరి పొట్ట దశలో జాగ్రత్తలు పాటించాలి


