
ట్రిపుల్‌ఐటీలో పారిశుద్ధ్య కార్మికుల విధుల బహిష్కరణ
● వర్సిటీని సందర్శించిన ఏసీఎల్ ● పెండింగ్ వేతనాలు ఇప్పించిన అధికారులు
భైంసా: బాసర ట్రిపుల్‌ఐటీలో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విఽ దులు బహిష్కరించి ట్రిపుల్‌ఐటీ ప్రధాన గేటు ఎదుట ఆందోళన నిర్వహించారు. కార్మికుల వేతనాల్లో కోతలు, భారీ అక్రమాలు చోటు చేసుకుంటున్నాయని, కోట్ల నిధులు పక్కదారి పట్టాయని ఆరోపణలు ఉన్నాయి. గడువు ముగిసినా ప్రైవేటు సంస్థకే పనులు పొడగించారని ప్రధాన ఆరోపణ ఉంది. 2021లో ప్రైవేటు సంస్థ ఏడాది గడువుతో పారిశుద్ధ్య నిర్వహణ దక్కించుకుంది. 2022లో కాంట్రాక్టు గడువు ముగిసినా అధికారులు అదే సంస్థకు పొడగిస్తున్నారు. దీనిపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి.
ఏసీఎల్ చేరుకుని...
కార్మిక శాఖ సహాయ కమిషనర్ ముత్యంరెడ్డి బాసర క్యాంపస్‌కు చేరుకుని విధులు బహిష్కరించి ఆందోళన కొనసాగిస్తున్న పారిశుద్ధ్య కార్మికులను కలిశారు. సమస్యలు అడిగితెలుసుకున్నారు. తమకు ఏప్రిల్ నుంచి వేతనాలు చెల్లించడంలేదని, ఇతర సమస్యలు ఉన్నాయని వివరించారు. దీంతో సహాయ కమిషనర్ ట్రిపుల్‌ఐటీ ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్‌తో పాటు ఇతర అధికారులతో చర్చించి మే నెల వరకు కార్మికుల వేతనాలను ఇప్పించారు. జూన్ వేతనాలను ఈనెల చెల్లించేలా చూడాలని సంబంధిత సంస్థను ఆదేశించారు. వేతనాలు అందడంతో కార్మికులు విధుల్లో చేరారు.