నిఘా నీడలో పోలింగ్ కేంద్రాలు
● 1,163 మంది పోలీస్ సిబ్బందికి విధులు
● సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టి
మహబూబ్‌నగర్ క్రైం: మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో పోలీస్‌శాఖ సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద ప్రత్యేక బందోబస్తు ఏర్పాటుపై దృష్టిసారించింది. ఒకవైపు ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి ఇప్పటికే డివిజన్లు, వార్డుల వారీగా పోలింగ్ కేంద్రాల వద్ద ఏర్పాటు చేయాల్సిన బందోబస్తుపై కార్యచరణ సిద్ధం చేశారు. దశలవారీగా పోలీస్ అధికారులు, సిబ్బందికి సమావేశాల నిర్వహణ పూర్తి చేశారు. డివిజన్లలో ఫ్లాగ్‌మార్చ్‌లు ఏర్పాటు చేసి ఓటర్లు ధైర్యంగా ఓటుహక్కు వినియోగించుకోవాలని అవగాహన కల్పించారు. ప్రతి సమస్యాత్మక కేంద్రం వద్ద ఏఎస్‌ఐ, నలుగురు కానిస్టేబుళ్లు ఉంటారు. ఒక్కో రూట్ పెట్రోలింగ్‌లో ఎస్‌ఐ, ముగ్గురు సిబ్బంది గస్తీ తిరుగుతుంటారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక తనిఖీలతో కమ్యూనిటీ కాంటాక్టు నిర్వహిస్తున్నారు. గతంలో ఆయా పోలింగ్ స్టేషన్లలో జరిగిన గొడవలు, ఘర్షణలు, దాడులు, ఓటర్లను మభ్య పెట్టడం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని సమస్యాత్మక కేంద్రాలను గుర్తించారు.
సమస్యాత్మక కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్పీ
జిల్లాలో కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ డి.జానకి వెల్లడించారు. నగరంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం ఉదయం ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో బందోబస్తు నిర్వహించే సిబ్బందికి సూచనలు అందించారు. రాత్రి నగరంలోని మోతీనగర్, బోయపల్లిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఎన్నికలు జరిగే పరిధిలో 144సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. ఎన్నికలు పూర్తయ్యి బ్యాలెట్ బాక్సులు స్ట్రాంగ్‌రూం చేరేవరకు అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రధానంగా సమస్యాత్మక కేంద్రాల్లో ఎలాంటి విధులు నిర్వహించాలనే విషయంపై సిబ్బందికి వివరించారు. 87 సమస్యాత్మక పోలింగ్ లోకేషన్స్‌లలో సీఐ లేదా ఎస్‌ఐ స్థాయి అధికారులతో స్టాటిక్‌ఫోర్స్, స్పెషల్ పార్టీ బలగాలచే బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొబైల్ రూట్‌టీంలు, సమస్యాత్మక కేంద్రాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలని, ఎక్కడైనా ఘటనలు జరిగితే మొబైల్ టీంలు క్షణాల్లో అక్కడికి చేరుకొని సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. భూత్పూర్ ఎన్నికల ప్రక్రియ ఏఆర్ ఏఎస్పీ సురేష్‌కుమార్, దేవరకద్ర అడ్మిన్ అదనపు ఎస్పీ ఎన్‌బీ రత్నం, మహబూబ్‌నగర్ కార్పొరేషన్ ఎస్పీతో పాటు మరో ఇద్దరు డీఎస్పీలు పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు.
నిఘా నీడలో పోలింగ్ కేంద్రాలు


