మహనీయుల బాటలో నడవాలి
బళ్లారి టౌన్: మహనీయులను జయంతులను ఆచరించడం వల్ల సమాజం ఐక్యత, శక్తి ప్రదర్శించేందుకు అవకాశం ఉంటుందని పాలికె మేయర్ పీ.గాదెప్ప పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని డాక్టర్ జోళదరాశి దొడ్డనగౌడ రంగమందిరంలో జిల్లా పాలన, జిల్లా పంచాయతీ తదితర శాఖల ఆధ్వర్యంలో సంత సేవలాల్ జయంతి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో పెద్దలు వేసిన బాటలో మనమందరం నడవాలన్నారు. మహనీయుల సందేశాలను రానున్న యువతకు తెలియజేయాలని సూచించారు. ఈసారి మహనగర పాలికె నిధులలో సుమారు 28 మంది మహనీయుల జయంతులను ఆచరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. సమాజ అభివృద్ధికి ఇలాంటి జయంతి సాంస్కృతిక కార్యక్రమాలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు. వీటి కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. జిల్లా గ్యారంటీ పథకాల ప్రాధికార అధ్యక్షుడు కేఈ చిదానందప్ప మాట్లాడుతూ.. సంత సేవలాల్ సత్యం, అహింస, త్యాగ మనోభావంతో సమాజ సేవకు తోడ్పడ్డారన్నారు. కార్యక్రమంలో నేతలు ప్రొఫెసర్ హెచ్.శాంత నాయక్, కన్నడ సాంస్కృతిక శాఖ ఏడీ నాగరాజు, సంద్యా రావు, సమాజ నేతలు పాల్గొన్నారు.


