హోరాహోరీగా గ్రామీణ క్రీడలు | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీగా గ్రామీణ క్రీడలు

Feb 15 2026 6:52 AM | Updated on Feb 15 2026 6:52 AM

హోరాహ

హోరాహోరీగా గ్రామీణ క్రీడలు

సాక్షి బళ్లారి: ప్రపంచ పర్యాటక కేంద్రంగా భాసిల్లుతున్న హంపీలో శనివారం ఉత్సాహంగా, ఉల్లాసంగా, కన్నుల పండువగా రెండో రోజు సాగిన ఉత్సవ కార్యక్రమాలు పర్యాటకులను ఆకట్టుకొన్నాయి. మొదటి రోజు హంపీ ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ప్రముఖ సినీ నటుడు శివరాజ్‌కుమార్‌ సంగీతం, నృత్యాలతో అదరగొట్టారు. తొలిసారిగా హంపీ ఉత్సవాల్లో డ్రోన్ల ప్రదర్శనతో హంపీ ఉత్సవ ప్రధాన వేదిక వద్ద స్మారకాలు, ప్రముఖుల చిత్రాలను విద్యుత్‌ కాంతులతో కళ్లకు కట్టినట్లు చూపించడం ఉత్సవాలకే హైలైట్‌గా నిలిచింది. ఉత్సవాల్లో ఉదయం నుంచి వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడోత్సవాలు సందర్శకులను కట్టిపడేశాయి. ఉదయం శ్రీవిరుపాక్షేశ్వర వేదికపై కవిగోష్టి, హొస మలపనగుడి విద్యారణ్యపీఠ హైస్కూల్‌ మైదానంలో కుస్తీ, గుండు ఎత్తే పోటీలతో గ్రామీణ క్రీడలను నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కుస్తీ క్రీడాకారులు తమ ప్రతిభను చాటారు.

మంత్రముగ్ధులను చేస్తున్న

సంగీత ప్రదర్శనలు

జిల్లా క్రీడా మైదానంలో గాలిపటాల ప్రదర్శన, శ్రీకృష్ణదేవరాయ వేదికపై స్థానిక కళాకారుల సంగీత నృత్య కార్యక్రమాలు, ప్రముఖ గాయని ఎండీ పల్లవి గానం మంత్రముగ్ధులను చేశాయి. సాసివెకాళు గణపతి వేదికపై టీవీ కళాకారుల సాంస్కృతిక వైవిధ్య కార్యక్రమాలు ఆకట్టుకొన్నాయి. హక్కబుక్క వేదికపై విజయనగర వైభవం ధ్వనివెలుగు ప్రదర్శన అలరించింది. విద్యారణ్య వేదికలో బయలాటలు, జానపద నాటకాలతో ఆయా వేదికల వద్ద ప్రజలను ఎంతో ఆకట్టుకున్నారు. ప్రధానంగా ఎంపీ ప్రకాష్‌ వేదికపై సినీ ప్రముఖులు గోల్డెన్‌స్టార్‌ గణేష్‌, రాజ్‌బీశెట్టి, రిషబ్‌మ్యాన్‌ తదితరులు పాల్గొని సంగీత నృత్య కార్యక్రమాలను ప్రదర్శించారు. ప్రధాన వేదిక వద్ద ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన లైటింగ్‌లు, నృత్యాలు హంపీ ఉత్సవాల్లో రెండో రోజు జోరు పెంచాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు హంపీ ఉత్సవాలకు విచ్చేసిన పర్యాటకులు హంపీలోని చారిత్రాత్మకమైన, మహిమాన్వితమైన కట్టడాలు, ఆలయాలను దర్శించి పునీతులయ్యారు.

ఉత్సవాలు అదుర్స్‌ అంటున్న సందర్శకులు

హంపీలోని విరుపాక్షేశ్వర, కోదండరామ, యంత్రోద్ధారక ఆంజనేయస్వామి ఆలయాలను భక్తులు దర్శించుకొన్నారు. శ్రీకృష్ణదేవరాయల గత వైభవాన్ని గుర్తు చేసేలా హంపీ ఉత్సవాలను అదరహో అన్నట్లుగా నిర్వహిస్తున్నారు. స్మారకాలకు విద్యుత్‌ దీపాలు, దారిపొడవునా లైట్లు ఏర్పాటు చేయడంతో ఉత్సవాలు రాత్రి, పగలు అనే తేడా లేకుండా విద్యుత్‌ కాంతులను వెదజల్లుతూ మైమరిపిస్తున్నాయి. దేశ, విదేశీ పర్యాటకులు హంపీ ఉత్సవాలు చాలా ఆనందాన్ని ఇస్తున్నాయని, ఇక్కడ స్మారకాలు, చారిత్రాత్మక, మహిమాన్విత ఆలయాలను ఎంత చూసినా తనివితీరడం లేదని సంతోషం వ్యక్తం చేశారు. ఉత్సవాల్లో గట్టి పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా మాఘమాసం శివరాత్రి పర్వదినం నేపథ్యంలో హంపీ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత సంతరించుకొంది. పవిత్ర నదీస్నానాలు చేయడంతో పాటు విరుపాక్షేశ్వర స్వామిని దర్శించుకొని హరహర మహాదేవ.. శంభోశంకరా అని నామస్మరణ చేస్తూ శివరాత్రి వేడుకలను కూడా భక్తిభావంతో ఆచరిస్తున్నారు.

రాతిగుండు ఎత్తుతున్న యోధుడు

ఎద్దుల బండి చక్రాలను తొలగిస్తున్న దృశ్యం

రెండో రోజు ఉట్టిపడిన పల్లె సంస్కృతి

రాయల రాజధాని వీధులు జనమయం

ఆలయాల దర్శనంతో భక్తులు పునీతం

ఉత్సవాలతో పాటు స్మారకాల సందర్శన

హోరాహోరీగా గ్రామీణ క్రీడలు1
1/1

హోరాహోరీగా గ్రామీణ క్రీడలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement