పద.. పదవె.. గాలిపటమా.!
హొసపేటె: చారిత్రక విజయనగర వైభవాన్ని చాటే హంపీ ఉత్సవం–2026లో భాగంగా ఎమ్మెల్యే హెచ్‌ఆర్ గవియప్ప శనివారం హొసపేటె నగరంలోని విజయనగర కళాశాల మైదానంలో గాలిపటాల ఎగరవేత ఉత్సవాన్ని ప్రారంభించారు. కన్నడ, సంస్కృతి శాఖ, విజయనగర జిల్లా యంత్రాంగం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం చూపరుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఉదయం నుంచి వందలాది మంది గాలిపటాల ప్రేమికులు మైదానంలో గుమిగూడారు. వివిధ డిజైన్లు, రంగురంగుల గాలి పటాలను ఎగరవేశారు. మైదానంలో గుమిగూడిన సందర్శకులు, స్థానికులు ఆకాశంలో ఎగురుతున్న భారీ గాలిపటాలను చూసి ఆనందించారు. ఒక భారీ గుర్రపు ఆకారపు గాలిపటం నీలి ఆకాశంలో గాలిలో ఎగిరింది. విజయనగర అశ్వికదళం ఆకాశంలో కదులుతున్నట్లు అనిపించింది.
త్రివర్ణ పతాకం తేజస్సు
వసుదైక కుటుంబం అనే సందేశంతో కూడిన త్రివర్ణ పతంగులు, సముద్ర అక్టోపస్ ఆకారపు పతంగులు పిల్లలను విశేషంగా అలరించాయి. ఫ్రేమ్ లేని ఈ పారాఫాయిల్ ఆకారపు పతంగులు గాలి తీవ్రతకు అనుగుణంగా ఆకారాన్ని మార్చుకుని, ప్రేక్షకుల్లో ఉత్సుకతను రేకెత్తించాయి.
కిక్కిరిసిన జససమూహం
సెలవు రోజు కావడంతో కళాశాల మైదానం ప్రజలతో నిండి పోయింది. యువకులు ఈలలు వేస్తూ గాలిపటాలు ఎగురుతున్న దృశ్యాలను చూస్తుండగా, పర్యాటకులు తమ మొబైల్ ఫోన్లలో ఈ అద్భుతమైన దృశ్యాలను బంధించడానికి పోటీ పడ్డారు. ఆకాశంలో రంగురంగుల పతంగులు సందడి చేశాయి. బెంగళూరు కై ట్ క్లబ్, పంజాబ్, గుజరాత్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్ నుంచి గాలిపటాలు ఎగురవేసిన భారీ బొమ్మలు ఈ సంవత్సరం గాలిపటాల ఉత్సవంలో హైలైట్‌గా నిలిచాయి. పదుల అడుగుల పొడవున్న ఎర్రని ఆక్టోపస్, ఆకాశంలో ఎగురుతున్నట్లు కనిపించే చిరుతపులి పతంగులు, కోతి పతంగులు పిల్లలను ప్రత్యేకంగా ఆకర్షించాయి. గాలి పటాల ఉత్సవ ప్రారంభోత్సవంలో జిల్లాధికారిణి కవిత ఎస్ మన్నికేరి, సబ్ డివిజనల్ ఆఫీసర్ వివేక్, మున్సిపల్ కౌన్సిల్ అధ్యక్షుడు రూపేష్ కుమార్, అర్బన్ డెవలప్‌మెంట్ సెల్ ప్రాజెక్ట్ డైరెక్టర్ మనోహర్, మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ శివకుమార్, బెంగళూరు కై ట్ క్లబ్ వీకే.రావు తదితరులు పాల్గొన్నారు.


