శ్మశాన వాటిక అభివృద్ధికి ఏకగ్రీవ ఆమోదం | - | Sakshi
Sakshi News home page

శ్మశాన వాటిక అభివృద్ధికి ఏకగ్రీవ ఆమోదం

Jun 12 2026 5:45 AM | Updated on Jun 12 2026 5:45 AM

కామారెడ్డి టౌన్‌ : మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదో వార్డులో ఉన్న హౌసింగ్‌ బోర్డు కాలనీ శ్మశాన వాటికను సుందరంగా అభివృద్ధి చేయడానికి ఎట్టకేలకు కామారెడ్డి మున్సిపల్‌ కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి అధ్యక్షతన గురువారం మున్సిపల్‌ సాధారణ సమావేశాన్ని నిర్వహించారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ ఎన్‌వీ గిరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

హౌసింగ్‌ బోర్డు కాలనీలోని శ్మశాన వాటికలో కనీస వసతులు లేకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని గతె నెలలో ‘సాక్షి’ దినపత్రిక వరుస కథనాలతో వెలుగులోకి తీసుకొచ్చింది. సమస్య పరిష్కారానికి ప్రముఖ సామాజిక సేవా సంస్థ ‘ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌’ చైర్మన్‌ తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ముందుకు వచ్చారు. శ్మశాన వాటికను మహా ప్రస్థానంగా తీర్చిదిద్దుతాని జిల్లా అధికారులకు విన్నవించారు. తమ సొంత నిధులతో స్మశాన వాటికను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి అవసరమైన పరిపాలన అనుమతులు మంజూరు చేయాలని కలెక్టర్‌ కోరారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఈనెల 5వ తేదీన కౌన్సిల్‌ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించినప్పటికీ వాయిదా వేసింది. మళ్లీ ఒకటే ఎజెండా అంశంగా గురువారం నిర్వహించి చర్చ జరిపారు. దీనిపై కాంగ్రెస్‌, బీజేపీ, బీఆర్‌ఎస్‌ కౌన్సిల్‌ సభ్యులంతా సానుకూలంగా స్పందిస్తూ, ఈ అంశాన్ని సింగిల్‌ ఎజెండాగా తీసుకొని, ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌కు అభివృద్ధి పనులు అప్పగిస్తూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. డీపీఆర్‌ సిద్ధం చేసి అభివృద్ది చేయాలని కౌన్సిల్‌ సభ్యులు కోరారు. ఇక హౌజింగ్‌ బోర్టు కాలనీలో శ్మశాన వాటికి సుందరంగా తయారుకానుంది. త్వరలోనే పనులను ప్రారంభించేందుకు సంస్థ సిద్ధమవుతోంది. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ’సాక్షి’ దినపత్రికు పలువురు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశంలో వైస్‌ చైర్‌పర్సన్‌ కాసర్ల గోదావరి, మున్సిపల్‌ కమిషనర్‌ టి పర్వతాలు, కౌన్సిల్‌, కో ఆప్షన్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.

సింగిల్‌ ఎజెండాగా సాగిన

కామారెడ్డి కౌన్సిల్‌ సమావేశం

సొంత నిధులతో మహాప్రస్థానంగా మార్చనున్న ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌

సమస్యను వెలుగులోకి తీసుకొచ్చిన ‘సాక్షి’

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement