తెయూ(డిచ్‌పల్లి): పర్యావరణ పరిరక్షణలో యువత భాగస్వామ్యం ఎంతో అవసరమని, ప్రతి విద్యార్థి కనీసం ఒక మొక్కను నాటి దాని సంరక్షణ బాధ్యత తీసుకోవాలని తెలంగాణ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు పిలుపునిచ్చారు. తెయూ జాతీయ సేవా పథకం (ఎన్‌ఎస్‌ఎస్) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఏక్ పేడ్ మా కే నామ్ – సోయింగ్ టు గ్రోయింగ్ –2026’ పర్యావరణ పరిరక్షణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాకుండా వాటిని సంరక్షించాలని సూచించారు. కార్యక్రమంలో తెయూ ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ప్రొఫెసర్ అపర్ణ, ప్రోగ్రాం ఆఫీసర్లు ఎన్ స్వామి, శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి కె గంగాకిషన్, ఎన్‌జీసీ స్టేట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ విద్యాసాగర్, ఎన్‌ఎస్‌ఎస్ కోఆర్డినేటర్ ఎ గోవర్ధన్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సహాయ పర్యావరణ ఇంజినీర్ మానస తదితరులు పాల్గొన్నారు.


