● సరికొత్త ఆటకు ప్రాచుర్యం
● శారీరక ఘర్షణలు లేని
క్రీడగా గుర్తింపు
● జాతీయ, అంతర్జాతీయ
స్థాయికి క్రీడాకారులు
కమ్మర్‌పల్లి:శారీరక ఘర్షణలు లేని ఆటగా చౌక్‌బా ల్ ఆట ప్రాచుర్యం పొందింది. 2009 సంవత్సరంలో దేశంలోకి గుర్తింపు పొందిన ఈ క్రీడల్లో నిజామాబాద్ జిల్లా కమ్మర్‌పల్లి మండలానికి చెందిన క్రీడాకారులు రాణిస్తున్నారు. త్వరలోనే అంతర్జాతీయ స్థాయి వేదికపై తమ ఆట తీరును ప్రదర్శించేందుకు సిద్ధమవుతున్నారు.
ఆటాడే విధానం ఇదే...
జట్టులో ఏడుగురు ఆటగాళ్లు ఉంటారు. రెండు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగుతుంది. అఫెన్స్ టీం ఆటగాళ్లలో ఒక షూటర్ బంతిని రీబౌండ్ ఫ్రేమ్ (నెట్) మీదకు విసిరితే అదే వేగంతో వెనక్కి వస్తుంది. ఆ బంతిని డిఫెన్స్ టీం(అవతలి జట్టు) సభ్యులు పట్టుకోకుండా నేలను తాకితే అఫెన్స్ టీంకు పాయింట్ లభిస్తుంది. ఒక వేళ డిఫెన్స్ టీం బంతిని పట్టుకుంటే(క్యాచ్) ఫౌల్ అవుతుంది. బంతిని పట్టుకున్న ఆటగాడు గరిష్టంగా 3 సెకన్లు మాత్రమే బంతిని తన దగ్గర ఉంచుకోవాలి. బంతితో 3 అడుగుల కన్నా ఎక్కువ నడవకూడదనే నిబంధన ఉంది. అఫెన్స్ జట్టు ఫ్రేమ్‌కు కొట్టేందుకు మూడు సార్లు పాస్ ఉంటుంది. ఆటగాళ్ళు ’డీ’ ఆకారపు క్రీజ్ లోపలికి వెళ్లి ఆడకూడదు. ఎప్పుడు దాని వెలుపలే నిలబడి లేదా గాల్లోకి దూకి మాత్రమే షాట్ కొట్టాలి. అఫెన్స్ జట్టు మూడుసార్లు పాస్ ఉపయోగించిన తర్వాత డిఫెన్స్ జట్టుకు బంతిని రీబౌండ్ ఫ్రేమ్(నెట్)కు కొట్టే అవకాశం లభిస్తుంది. ఆట 30 నిమిషాల నుంచి 35 నిమిషాల వరకు ఉంటుంది. ఈ సమయంలో ఏ జట్టు ఎక్కువ పాయింట్లు సాధిస్తే ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఆటలో ఇద్దరు కార్నర్, ఒక షూటర్, మిడిల్, ఇద్దరు డిపెండర్లు పొజిషన్‌లో ఉంటారు.
కమ్మర్‌పల్లిలో ఆటగాళ్లు...
కమ్మర్‌పల్లి మండల కేంద్రంలోని మిసిమి హైస్కూల్‌లో పీఈటీ సంజీవ్ చౌక్‌బాల్ ఆటను పరిచయం చేశారు. ఏమాత్రం పరిచయం లేని ఆటపై విద్యార్థులకు శిక్షణ ఇచ్చి రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లుగా తీర్చిదిద్దారు. నైపుణ్యాలు నేర్పి ఆటలోని మెలకువలను ప్రదర్శింపజేశారు. ఫలితంగా విద్యార్థులు రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ చాటుతున్నారు. ఇటీవల పాఠశాలకు చెందిన సీహెచ్. శాశ్వంత్, సౌమిత్(ప్రభుత్వ పాఠశాల) జాతీయస్థాయికి ఎంపికై గోవాలో జరిగిన క్రీడాపోటీల్లో పాల్గొన్నారు. శాశ్వంత్ జాతీయస్థాయి క్రీడల్లో ప్రతిభ కనబరిచి అంతర్జాతీయ స్థాయి క్రీడలకు ఎంపికయ్యాడు. మలేసియాలో ఆగష్టు 19 నుంచి జరిగే అంతర్జాతీయ చౌక్‌బాల్ పోటీల్లో పాల్గొననున్నాడు. గతేడాది అక్షిత్, రేవంత్ అనే విద్యార్థులు వైజాగ్‌లో నిర్వహించిన జాతీయ స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొన్నారు.


