నాగిరెడ్డిపేట/ఎల్లారెడ్డిరూరల్/దోమకొండ: తల్లిదండ్రులు వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చే
ర్పించాలని నాగిరెడ్డిపేట మండలం ధర్మారెడ్డి గ్రామ సర్పంచ్ లక్ష్మీ అన్నారు. గ్రామంలో గురువారం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి గ్రామంలో ర్యాలీ చేపట్టారు. విద్యార్థులకు ప్రభుత్వం అన్ని వసతులు కల్పించడంతోపాటు నాణ్యమైన భోజనం సైతం అందిస్తుందన్నారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ జయరాజ్, పంచాయతీ కార్యదర్శి రమేష్, ఉపాధ్యాయురాలు జ్యోతితోపాటు నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఎల్లారెడ్డి జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలకు చెందిన సీఆర్‌పీలు బడిబాట కార్యక్రమం నిర్వహించారు. చిన్నారులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఆర్‌పీ మహేష్, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్ వనజ తదితరులున్నారు. దోమకొండ మండలం సీతారాంపూర్ గ్రామంలో సర్పంచ్ నత్తి సంజీవ్ ఆధ్వర్యంలో బడిబాట నిర్వహించారు. ఈసందర్భంగా ఉపాధ్యాయులు ఇంటింటికి తిరుగుతూ విద్యార్థుల పేర్లను నమోదు చేసుకున్నారు. హెచ్‌ఎం దత్తాద్రి, ఉపాధ్యాయులు శ్రీనివాసులు శర్మ, రామరాజు, వార్డు సభ్యులు స్వామిగౌడ్ ,రాజిరెడ్డి, కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు సంతోష్ రెడ్డి, గ్రామస్తులు పాల్గొన్నారు.


