ఆటో, స్కూటీ ఢీ.. యువకుడి మృతి
కమ్మర్‌పల్లి: కమ్మర్‌పల్లి మండలం కోనసముందర్‌లో గురువారం స్కూ టీని ఆటో ఢీ కొనడంతో గ్రామానికి చెందిన లాడే చరణ్ (18) మృతి చెందినట్లు ఎస్సై సతీశ్ తెలిపారు. మృతుడి తండ్రి అశోక్ ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవర్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
చికిత్స పొందుతూ ఒకరు..
కామారెడ్డి క్రైం : భార్యా, భర్తల మధ్య గొడవ కారణంగా క్షణికావేశంలో గడ్డి మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన కామారెడ్డి మండలం రామేశ్వర్‌పల్లి తండాలో గురువారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. తండాకు చెందిన గుగులోత్ బాల్‌సింగ్ (42) బుధవారం సాయంత్రం ఇంట్లో భార్యతో చిన్న విషయంలో గొడవపడ్డాడు. మనస్తాపానికి గురై గుర్తు తెలియని గడ్డిమందు తాగేశాడు. కుటుంబసభ్యులు గమనించి నిజామాబాద్ జీజీహెచ్‌కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందినట్లు దేవునిపల్లి ఎస్సై రంజిత్ తెలిపారు.
అనారోగ్యంతో వృద్ధురాలి ఆత్మహత్య
కామారెడ్డి క్రైం : అనారోగ్య సమస్యలు వేధిస్తుండటంతో విసిగిపోయిన ఓ వృద్ధురాలు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది. లింగాపూర్ గ్రామానికి చెందిన బండారు రాజమణి (88) వృద్ధాప్యం, అనారోగ్య సమస్యలతో బాధపడుతోంది. జీవితంపై విరక్తితో ఆమె గురువారం సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది. దేవునిపల్లి పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేపట్టారు.


