పల్లె ఆటలతో ఐకమత్యం | - | Sakshi
Sakshi News home page

పల్లె ఆటలతో ఐకమత్యం

Jun 11 2026 8:11 AM | Updated on Jun 11 2026 8:11 AM

ఆలోచన విధానం మారాలి ఐక్యత భావం పెరుగుతుంది గ్రామీణ క్రీడల ప్రాధాన్యతను తెలియజెప్పాలి

ఆటలు ఆడితేనే ఆరోగ్యం

బలపడుతున్న బంధాలు

వేసవి సెలవులతో

వీధుల్లో పిల్లల సందడి

ఆర్మూర్‌ : గ్రామీణ ప్రాంతాల్లోని పెద్దలు పరిచయం చేసే ప్రతీ ఆట కొత్త ప్రపంచమే. వేసవి సెలవుల్లో పిల్లలు సెల్‌ఫోన్లకు అతుక్కుపోకుండా, వాటి చెర నుంచి తప్పించే ఆటలు చాలా ఉన్నాయి. ఆరోగ్యంతోపాటు ఏకాగ్రత, పట్టుదలను పెంచే ఆటలైన క్యారమ్స్‌, అష్టాచెమ్మా, వైకుంఠపాలి, చెస్‌, పులిమేక, గిల్లిదండా, గోటీలు, కోతి కొమ్మచ్చి జ్ఞాపకాలుగా మిగిలిపోయాయి. ప్రస్తుతం వేసవి సెలవుల్లో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లిన విద్యార్థులను అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య, మామయ్యలు గ్రామీణ క్రీడల వైపు మరల్చుతున్నారు. ఫలితంగా స్నేహభావం, ఐకమత్యం, ఏకాగ్రత, క్రమశిక్షణ, సోదర భావం, సమానత్వంతోపాటు శారీరక శ్రమ, మెదడుకు మేత పెట్టే గ్రామీణ క్రీడలపై ఆసక్తి పెరుగుతోంది. మట్టి వాసన, చెమట చుక్కల విలువ తెలియని తరానికి అమ్మమ్మ, తాతయ్యలు వాటి ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. స్క్రీన్‌ టైమ్‌కు బ్రేక్‌ ఇచ్చి, ఒక్కసారైనా పిల్లల చేయి పట్టుకొని వీధిలోకి తీసుకెళ్లి గిల్లీదండా ఆడిద్దాం... కనుమరుగవుతున్న ఆటలతోపాటు కలిసిపోతున్న మన సంస్కృతిని కాపాడుకుందాం అంటూ పిల్లలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు.

వీధుల్లో ఒకప్పటి సందడి...

ఉద్యోగాల రీత్యా ఇతర ప్రాంతాల్లో ఉండే వారంతా వేసవి సెలవుల్లో తమ పిల్లలను సొంతూళ్లకు పంపించడానికి ఇష్టపడుతున్నారు. దీంతో పిల్లలు వీధుల్లో గిల్లీ దండా, కోతి కొమ్మచ్చి, గోటీలు, తొక్కుడు బిళ్ల, సైకిల్‌ టైర్‌ తిప్పడం, చార్‌పత్తి, దాగుడు మూతలు, బొంగరాలు, కబడ్డీ ఆడేవారు. కై లాసం, అష్టాచెమ్మా, పైల పచ్చీస్‌, చింత గింజ లాట లాంటి ఇండోర్‌ గేమ్స్‌కు ఆడుతూ కనిపిస్తున్నారు. చెరువులు, కాలువల్లో ఈత కొట్టే మధురానుభూతిని పంచుకుంటున్నారు.

గ్రామీణ క్రీడలు ఆడుతున్న పిల్లలను వారిస్తూ పాశ్చాత్య ధోరణితో వ్యవహరిస్తున్న తల్లిదండ్రులు తమ ఆలోచన విధానాన్ని మార్చుకో వాలి. మార్కులే జీవితం కా దు. పిల్లలతో అన్ని రకాల క్రీడలను ఆడించాలి. మనం ఆడిన ఆటలే మనకు నేర్పిన నాయకత్వ లక్షణాలు ఉపయోగపడుతున్నాయి. – ఈరవత్రి రాజశేఖర్‌, చార్టెడ్‌ అకౌంటెంట్‌, ఆర్మూర్‌

కలిసికట్టుగా గ్రామాల్లో పిల్లలు ఆటలాడటంతో వారిలో ఐక్యతా భావం పెరుగుతుంది. ఓడిపోయినా నవ్వుతూ ఎలా స్వీకరించాలో నేర్పేది మట్టిలో ఆడే ఆటలే. ఇవి మానసికంగా పిల్లలను బలవంతులను చేస్తాయి.

– రామ్మోహన్‌, ప్రధానోపాధ్యాయుడు, మల్లారం, నిజామాబాద్‌

గ్రామీణ క్రీడల ప్రాధాన్యతను నేటితరం పిల్లలకు పరిచయం చేయాల్సిన అవస రం ఎంతైనా ఉంది. సెల్‌ఫోన్లు, టీవీల పుణ్యమా అని అసలు క్రీడలంటేనే తెలియ ని పరిస్థితి ప్రమాదకరం. పాఠ్యపుస్తకాల్లో ఒక పాఠంగా చేర్చాలి. – శ్రీనివాస్‌,

ప్రధానోపాధ్యాయుడు, పెర్కిట్‌, ఆర్మూర్‌

క్రీడలతోనే మానసికోల్లాసం లభిస్తుందని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. కనీసం సెలవు దినాల్లోనైనా పిల్లలు తమకు ఇష్టమైన ఆటలు ఆడుకొనేలా ప్రోత్సహించాలి. రోజూ గంటసేపు చెమట పట్టేలా ఆడితేనే ఆరోగ్యం.

– రాజగంగారాం,

మండల విద్యాధికారి, ఆర్మూర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement