మద్నూర్: జాతీయ రహదారుల వెంబడి ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులను టార్గెట్ చేస్తూ దోపిడీలకు పాల్పడుతున్న ఓ అంతర్రాష్ట్ర ముఠాను మద్నూర్ పోలీసులు అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాన్సువాడ డీఎస్పీ విఠల్ రెడ్డి వివరాలు వెల్లడించారు. ఈ నెల 1న మద్నూర్ సమీపంలోని జాతీయ రహదారి 161 పై బైక్‌పై ప్రయాణిస్తున్న మహారాష్ట్రలోని దెగ్లూర్‌కు చెందిన షేక్ గౌస్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అడ్డగించి, కత్తితో చంపుతామని బెదిరించి మొబైల్, రూ.వేయి నగదును దోచుకెళ్లారు. అతని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బిచ్కుంద సీఐ రవికుమార్, మద్నూర్ ఎస్‌ఐ మోహన్ రెడ్డి, సీసీఎస్ ఎస్సై ఉస్మాన్ లతో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. సాంకేతిక ఆధారాలు, సీసీ ఫుటేజీల సహాయంతో నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను మహారాష్ట్ర లోని నాందేడ్ జిల్లాకు చెందిన షేక్ ఇలియాస్, మహమ్మద్ ఇస్మాయిల్ అలియాస్ జునైద్, సమీర్‌షాలుగా గుర్తించారు. నిందితులు ముఠాగా ఏర్పడి జాతీయ రహదారుల వెంబడి ఒంటరిగా ప్రయాణించే వారిని టార్గెట్ చేస్తూ మారణాయుధాలతో బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్నట్లు విచారణలో తేలింది. పథకం ప్రకారం ఈ నెల 1న నాందేడ్ నుండి బైక్‌పై వచ్చి మద్నూర్ వద్ద షేక్ గౌస్‌ను దోచుకోవడంతో పాటు, అదే రాత్రి జుక్కల్ చౌరస్తా వద్ద శ్రీనివాస్ అనే వ్యక్తిని కత్తితో బెదిరించి మొబైల్ ఫోన్, రూ.300 నగదు లాక్కుని పరారయ్యారు. ఆ వెంటనే నిజాంసాగర్ పరిధిలో చాకలి రాజు అనే వ్యక్తిని బెదిరించి పల్సర్ బైక్‌ను దోచుకున్నారు. ఈ మూడు ఘటనలపై మద్నూర్, జుక్కల్, నిజాంసాగర్ పోలీస్ స్టేషన్‌లలో కేసులు నమోదై ఉన్నాయి. సలాబత్‌పూర్ చెక్‌పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు వారిని గుర్తించి పట్టుకొని అదుపులోకి తీసుకున్నారని డీఎస్పీ తెలిపారు. వారి వద్ద నుంచి దోపిడీలకు ఉపయోగించిన 3 కత్తులు, 4 సెల్‌ఫోన్లు, 2 బైక్‌లు స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలిస్తున్నట్లు వెల్లడించారు. కేసు చేధనలో కృషి చేసిన పోలీసు అధికారులు, కానిస్టేబుళ్లు విఠల్, విష్ణు, శ్రావణ్, శివ, శ్రీకాంత్‌లను అభినందించారు. ఒంటరిగా ప్రయాణించే సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే పోలీసులకు సమాచారం అందించాలని డీఎస్పీ సూచించారు.
జాతీయ రహదారుల వెంబడి ఒంటరిగా ప్రయాణించే వ్యక్తులే టార్గెట్
ముగ్గురు నిందితుల రిమాండ్
వివరాలు వెల్లడించిన డీఎస్పీ విఠల్ రెడ్డి


