● డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్
ఎల్లారెడ్డి: ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని డీసీసీ అధ్యక్షుడు ఏలె మల్లికార్జున్ అన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన బీఎల్‌ఏల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మల్లికార్జున్ మాట్లాడుతూ ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో బీఎల్‌ఏల పాత్ర అత్యంత కీలకమని అన్నారు. ప్రతి బీఎల్‌ఏ తన బూత్ పరిధిలోని ఓటర్ల వివరాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పులు, తప్పుల సవరణలు, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయానికి బలమైన బూత్ వ్యవస్థే పునాదిగా నిలుస్తుందని తెలిపారు. గ్రామస్థాయి నుంచి పార్టీని మరింత బలోపేతం చేయడానికి ప్రతి కార్యకర్త అంకితభావంతో పనిచేయాలని సూచించారు. అనంతరం బీఎల్‌ఏ మాస్టర్ ట్రైనర్ నరేశ్ రాథోడ్, మోహన్ కార్యకర్తలకు శిక్షణనిచ్చారు. కార్యక్రమంలో ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, లింగంపేట తదితర మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సాయిబాబా, శ్రీధర్‌గౌడ్, బీఎల్‌ఏలు, ఆత్మ కమిటీ చైర్మన్ దశరథ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


