భూసేకరణపై ఆర్‌ఆర్ కమిటీ సమీక్ష
భిక్కనూరు : ప్రపంచ వ్యాప్తంగా మంచినూనెలకు డిమాండ్ ఉన్న నేపథ్యంలో రైతులు ఆయిల్ పామ్ సాగువైపు దృష్టి సారించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా పంటలను సాగు చేస్తే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని సూచించారు. భిక్కనూర్ మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ ఆవరణలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం, అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జల సంరక్షణ–మన సంరక్షణలో భాగంగా జిల్లాలో 36 వేల కందకాలను తవ్వామని, దీంతో భూగర్భ జలాల పెంపుదల జరుగుతుందన్నారు. గ్రామాల్లో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగేందుకు ప్రజలు పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు. వర్షాకాలం ప్రారంభమైనందున సీజనల్ వ్యాధులు ప్రబలకుండా దోమల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో భాగంగా ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నామని, 18 ఏళ్లు నిండిన అర్హులైన వారిని ఓటరు జాబితాలో నమోదు చేయడం, డబుల్ ఓటర్ల పేర్లను తొలగిస్తున్నట్లు తెలిపారు. గ్రామాల్లో నెలకొన్న విద్యుత్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ అధికారులకు సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అర్హులైన లబ్ధిదారులకు చేరేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. అనంతరం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామ పంచాయతీ సిబ్బందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి, సర్పంచ్ బల్యాల రేఖ సుదర్శన్, ఉప సర్పంచ్ మోహన్ రెడ్డి, తహసీల్దార్ సునీత, ఎంపీడీవో రాజకిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కామారెడ్డి క్రైం: మంజీరా ఎత్తిపోతల పథకం కోసం చేపడుతున్న భూసేకరణ ప్రక్రియపై ప్రాజెక్టు స్థాయి పునరావాస, పునర్నిర్మాణ (ఆర్‌ఆర్) కమిటీ సమావేశాన్ని కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధ్యక్షతన నిర్వహించారు. పిట్లం మండలంలోని నాగంపల్లి, పెద్ద అన్నారం గ్రామాల్లో మంజీరా ఎత్తిపోతల పథకం కోసం చేపడుతున్న భూసేకరణ అంశాలను పరిశీలించారు. తక్కువ విస్తీర్ణంలో మాత్రమే భూములను సేకరిస్తుండటంతో నివాస గృహాలను మరోచోటికి మార్చే అవసరం లేదని, కుటుంబాల జీవనోపాధిపై కూడా ఎలాంటి ప్రతికూల ప్రభావం ఉండదని కమిటీ అభిప్రాయపడింది. భూ సేకరణలో న్యాయమైన పరిహారం, పారదర్శకత హక్కు చట్టం–2013 ప్రకారం పునరావాస, పునర్నిర్మాణ ప్రయోజనాలు వర్తించవని కమిటీ నివేదించింది. సమావేశంలో అదనపు కలెక్టర్, రెవెన్యూ, ఇంజినీరింగ్ శాఖల అధికారులు, బ్యాంకర్లు పాల్గొన్నారు.
సమస్యల పరిష్కారం కోసమే
‘ప్రజాపాలన– ప్రగతి ప్రణాళిక’
సంక్షేమ పథకాలు అర్హులకు
చేరేలా చూడాలి
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్


