కానిస్టేబుల్‌ కుటుంబానికి అండగా ఉంటాం | - | Sakshi
Sakshi News home page

కానిస్టేబుల్‌ కుటుంబానికి అండగా ఉంటాం

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

కానిస్టేబుల్‌ కుటుంబానికి అండగా ఉంటాం పీహెచ్‌సీ తనిఖీ ప్రభుత్వ బడుల్లోనే మెరుగైన సౌకర్యాలు కాలేజీ పరిసరాలు శుభ్రంగా ఉండాలి

ఎస్పీ రాజేశ్‌చంద్ర

బాన్సువాడ: కానిస్టేబుల్‌ రఘు కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని జిల్లా ఎస్పీ రాజేశ్‌చంద్ర అన్నారు. బాన్సువాడ పట్టణానికి చెందిన కానిస్టేబుల్‌ రఘు మంగళవారం గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. బుధవారం ఆయన కుటుంబాన్ని ఎస్పీ రాజేశ్‌చంద్ర పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కానిస్టేబుల్‌ రఘు విధి నిర్వహణలో నిబద్ధత, క్రమశిక్షణ, అంకితభావంతో పనిచేసే పోలీసు సిబ్బందిలో ఆయన ఒకరని అన్నారు. కుటుంబసభ్యులు ధైర్యంగా ఉండాలని, పిల్లల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మనోధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగాలని సూచించారు. ఎస్పీ వెంట బాన్సువాడ టౌన్‌, సీఐలు శ్రీధర్‌, తిరుపయ్య, సంతోష్‌కుమార్‌, ఎస్సై మహేందర్‌ తదితరులు ఉన్నారు.

మాచారెడ్డి: మాచారెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్వో వెంకటి బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బంది హాజరు పట్టికతోపాటు ఔషధ పట్టికను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉంటున్నారా? అని ఆరా తీశారు. వైద్యాధికారి ఆదర్శతోపాటు సిబ్బందికి పలు సలహాలు సూచనలు చేశారు. వర్షాకాలంలో సోకే సీజనల్‌ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.

డీఈవో మల్లికార్జున్‌

భిక్కనూరు : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు మెరుగుపడ్డాయని జిల్లా విద్యాశాఖ అధికారి మల్లికార్జున్‌ పేర్కొన్నారు. ప్రయివేటు పాఠశాలల కన్నా మెరుగైన విద్యాబోధన జరుగుతోందని వివరించారు. భిక్కనూరు మండల కేంద్రంలో బుధవారం నిర్వహించిన బడిబాటలో డీఈవో పాల్గొని మాట్లాడారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. ఎంఈవో రాజగంగారెడ్డి, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల హెచ్‌ఎం భవానీ, ప్రాథమిక పాఠశాల హెచ్‌ఎం శిరీషరాణి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

గాంధారి (ఎల్లారెడ్డి) : కాలేజీతోపాటు పరిసరాలు శుభ్రంగా, ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలని ఇంటర్‌ బోర్డు నోడల్‌ అధికారి షేఖ్‌ సలాం సూచించారు. బుధవారం ఆయన స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కాలేజీని సందర్శించారు. ఈ సందర్భంగా కాలేజీలో జరుగుతున్న మరమ్మతు పనులను పరిశీలించారు. కాలేజీ పరిసరాలు శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్‌ గడ్డం గంగారాంకు సూచించారు.

13న అస్మిత ఖేలో

సైక్లింగ్‌ పోటీలు

నిజామాబాద్‌ అర్బన్‌: జిల్లా స్థాయి అస్మిత ఖేలో ఇండియా ఉమెన్‌ సైక్లింగ్‌ సిటీ లీగ్‌ వర ల్డ్‌ బైస్కిల్‌ డే సైక్లింగ్‌ పోటీలను ఈనెల 13వ తేదీన నిర్వహించనున్నట్లు జిల్లా సైక్లింగ్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి బి విజయ్‌కాంత్‌రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పోటీలను తెలంగాణ యూనివర్సిటీ లో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మహిళల విభాగంలో 19 సంవత్సరాలు పైబడిన వారికి, జూనియర్‌ బాలికల విభాగంలో 17 నుంచి 18 సంవత్సరాల వారికి, సబ్‌ జూనియర్‌ బాలికల విభాగంలో 13 నుంచి 16 సంవత్సరాల బాలికలకు పోటీలు ఉంటాయని తెలిపారు. మిగతా వివరాలకు 99128 83331 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement