మద్నూర్(జుక్కల్) : ఫోన్‌లో ఎక్కువ సేపు మాట్లాడొద్దన్నందుకు మండలంలోని పెద్ద తడ్గూర్‌కు చెందిన భాగ్యవార్ సంధ్య(15) అనే బాలిక ఆత్మహత్యకు పాల్పడిందని ఎస్సై మోహన్‌రెడ్డి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి.. పెద్ద తడ్గూర్‌కు చెందిన భాగ్యవార్ మాదప్ప కూతురు సంధ్య ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. ఇంటర్మీడియెట్ కోసం బోధన్‌లోని ఓ ప్రైవేటు కళాశాలలో అడ్మిషన్ తీసుకున్నారు. తనతోపాటు ఎస్సెస్సీ పూర్తి చేసిన స్నేహితులు ఏ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారని తరుచూ వారితో ఫోన్ మాట్లాడుతుండడంతో తండ్రి మాదప్ప ఆమెను సోమవారం సాయంత్రం మందలించాడు. మంగళవారం ఉదయం మాదప్పతోపాటు ఆయన భార్య పొలానికి వెళ్లగా ఇంట్లో ఎవరు లేని సమయంలో సంధ్య దూలానికి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


