కామారెడ్డి అర్బన్ : కామారెడ్డి కూచిపూడి కళాక్షేత్రం వార్షికోత్సవం మంగళవారం రాత్రి స్థానిక కళాభారతి ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. నటులు ఇంద్రజ, బలగం మురళీధర్‌గౌడ్, అదిరే అభిలు వార్షికోత్సవంలో స్టెప్పులు వేస్తూ సందడి చేశారు. ఈ సందర్భంగా కళాకారులు ప్రదర్శించిన కూచిపూడి, జానపద, సంప్రదాయ నృత్యాలు అలరించాయి. కూచిపూడి కళాక్షేత్రం వ్యవస్థాపకుడు, జాతీయ నృత్య కళాకారుడు వంశీ ప్రతాప్ గౌడ్ నృత్య కళకు అంకింతమై వందలాది మంది నృత్య కళాకారులను తీర్చిదిద్దడం అభినందనీయమని ముఖ్యఅతిథి వ్యాపార వేత్త సుభాష్‌రెడ్డి అన్నారు. తన నృత్య గురువు వంశీప్రతాప్‌గౌడ్ కావడం గర్వకారణంగా ఉందని నటుడు అభి అన్నారు. తెలంగాణ ఫిలిం చాంబర్ అధ్యక్షుడు పి.రామకృష్ణగౌడ్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎం.చంద్రకాంత్‌రెడ్డి, పాటల రచయిత మిట్టపల్లి సురేందర్ పాల్గొన్నారు.స్థానిక నాయకులు, కళాభిమానులతో ఆడిటోరియం కిక్కిరిసిపోయింది.


