సర్‌ వచ్చేస్తున్నారు! | - | Sakshi
Sakshi News home page

సర్‌ వచ్చేస్తున్నారు!

Jun 10 2026 12:49 AM | Updated on Jun 10 2026 12:49 AM

సర్‌ వచ్చేస్తున్నారు!

80 శాతం వరకు మ్యాపింగ్‌..

అర్హులందరికీ ఓటు హక్కు కల్పించడంతోపాటు నకిలీ ఓట్లను ఏరివేసే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం తలపెట్టిన స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ (ఎస్‌ఐఆర్‌)లో భాగంగా మ్యాపింగ్‌ ప్రక్రియ చివరి దశకు చేరింది. ఈనెల 25 నుంచి ఇంటింటి సర్వేతో సర్‌ ప్రక్రియ ఊపందుకోనుంది. ఇదే సమయంలో అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతుకాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న అంశంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. – కామారెడ్డి క్రైం

‘సర్‌’ ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా చేపట్టేందుకు అధికార యంత్రాంగం సమాయత్తమైంది. పారదర్శకమైన ఓటరు జాబితా రూపకల్పనే లక్ష్యంగా చేపట్టిన సర్‌ప్రక్రియ ఈనెల 15వ తేదీన ప్రారంభమై అక్టోబర్‌ 1 న విడుదల చేసే తుది ఓటరు జాబితాతో ముగియనుంది. ఈ మొత్తం ప్రక్రియలో బీఎల్‌వో (ఎన్యుమరేటర్‌)లదే కీలక పాత్ర కానుంది. వారి పనితీరు, మొత్తం ప్రక్రియను తహసీల్దార్లు, సంబంధిత ఆర్డీవోలు ఈఆర్వోల హోదాలో పర్యవేక్షించనున్నారు. సమగ్ర ఓటరు సర్వే ప్రారంభం కానుండడంతో ఓట్లు రద్దు కాకుండా ఉండడం కోసం ఓటర్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎన్యుమరేషన్‌ ప్రక్రియను ఎలా పూర్తి చేసుకోవాలి అనే అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారు.

15 నుంచి ప్రక్రియ ప్రారంభం..

జిల్లాలో సమగ్ర ఓటరు సర్వే ప్రక్రియ ఈనెల 15 నుంచి ప్రారంభిస్తారు. ఎన్యుమరేటర్‌ జాబితా తయారీ, వారికి శిక్షణ, పోలింగ్‌ కేంద్రాల కేటాయింపులు, ఎన్యుమరేషన్‌ పత్రాల ప్రింటింగ్‌ లాంటి పనులు 24 వ తేదీ వరకు పూర్తి చేసుకోనున్నారు. 25 నుంచి క్షేత్ర స్థాయిలో ఇంటింటి సర్వే ప్రారంభం అవుతుంది. జూలై 24న సర్వే పూర్తిచేసి, అదే రోజున పోలింగ్‌ కేంద్రాల క్రమబద్ధీకరణ చేపడతారు. జిల్లాలో తాజా లెక్కల ప్రకారం 6,99,019 మంది ఓటర్లున్నారు. దీంట్లో కామారెడ్డి నియోజకవర్గం పరిధిలో 2,61,216 మంది, ఎల్లారెడ్డిలో 2,28,551 మంది, జుక్కల్‌ పరిధిలో 2,09,252 మంది ఓటర్లు ఉన్నారు. ఇదివరకే గుర్తించిన విధంగా జిల్లాలోని 3 (కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్‌) నియోజకవర్గాల పరిధిలో ప్రతి 1,200 మంది ఓటర్లకు ఒక పోలింగ్‌ కేంద్రం చొప్పున మొత్తం 791 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో కామారెడ్డి పరిధిలో 267, ఎల్లారెడ్డిలో 274, జుక్కల్‌లో 250 పీఎస్‌లున్నాయి. ఒక్కో పీఎస్‌కు ఒక బీఎల్‌వో ఉన్నారు.

పేరుందో లేదో తెలుసుకోండిలా..

2002 ఓటరు జాబితాను ప్రామాణికంగా తీసుకుని సర్‌ ప్రక్రియ నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో అప్పటి జాబితాలో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవడానికి స్థానిక బీఎల్‌వోను సంప్రదిస్తే సరిపోతుంది. ఎన్నికల సంఘానికి సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌ https://ceotelangana.nic.in లేదా https://voters.eci.gov.in పోర్టల్‌లోనూ వివరాలు తెలుసుకోవచ్చు.

జుక్కల్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గాల పరిధిలో 80 శాతం వరకు మ్యాపింగ్‌ ప్రక్రియ పూర్తయ్యింది. కామారెడ్డి నియోజకవర్గంలో 70 శాతం దాటింది. చాలా మంది ఓటర్లు ఇళ్లు మారడం, అందుబాటులో లేకపోవడంతో అర్బన్‌ ఏరియాలలో మ్యాపింగ్‌ స్లోగా సాగుతున్నట్లు తెలుస్తోంది.

చివరి దశకు మ్యాపింగ్‌ ప్రక్రియ

ఈనెల 25 నుంచి

నెలపాటు ఇంటింటి సర్వే

జూలై 31 నుంచి

అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ

సెప్టెంబర్‌ 28 వరకు

పరిష్కారాలకు అవకాశం

అక్టోబర్‌ 1 న తుది ఓటరు జాబితా

కీలకంగా వ్యవహరించనున్న బీఎల్‌వోలు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement