నిజామాబాద్‌అర్బన్/మోపాల్: జిల్లాకు చెందిన రోడ్లు, భవనాల శాఖ ఈఎన్‌సీ జరుపుల మోహన్ నాయక్ ఇంటితో పాటు బంధువులు, బినామీల ఇళ్లపై ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచే మెరుపు దాడులు చేశారు. ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలకు చెందిన ఏసీబీ అధికారులు ఐదు బృందాలుగా విడిపోయి విస్తృత తనిఖీలు నిర్వహించారు. హైదరాబాద్‌లోని ఆర్‌అండ్‌బీ శాఖలో ఇంజనీర్ ఇన్ చీఫ్ (ఈఎన్‌సీ)గా మోహన్ నాయక్ విధులు నిర్వహిస్తున్నారు. భారీ అక్రమాస్తులు సంపాదించినట్లు ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు 11 ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులకు దిగారు. మోపాల్ మండలం కులాస్‌పూర్ తండా ఆయన సొంత గ్రామం. మోహన్ నా యక్ ఇంటితో పాటు ఫామ్‌హౌస్, మాధవనగర్ సమీపంలోని ఆయన బావమరిది, డిప్యూటీ తహసీల్దార్ ఆనంద్ నివాసం, మరో బావమరిది మాక్లూర్ మండలం అమ్రాద్ తండాలో నివసిస్తున్న రెడ్యా నాయక్, ఆయన స్నేహితుడు సంజీవ్‌రెడ్డి (కాంట్రాక్టర్) జిల్లా కేంద్రంలోని మారుతినగర్, వేల్పూర్‌లో ఏసీబీ అధికారులు సోదాలు చేపట్టారు. సంజీవ్‌రెడ్డి మోహన్ నాయక్‌కు దగ్గరి సన్నిహితుడు.
గతంలో మోహన్ నాయక్ జిల్లాలో ఆర్‌అండ్‌బీ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ఎస్‌ఈగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. ఈక్రమంలో ఇక్కడ కొందరు కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క అక్రమార్జన చేపట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మోహన్ నాయక్‌కు సన్నిహితంగా ఉన్న కుటుంబ సభ్యుల ఇళ్లల్లోనూ తనిఖీలు చేసి, స్థిరాస్తులు, వ్యవసాయ భూములు, ఓపెన్ ప్లాట్లు, ఇతరత్ర కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ సోదాలు కొనసాగాయి.
కలకలం రేపుతున్న దాడులు..
జిల్లాకు చెందిన కొందరు ఉన్నతాధికారులు ఇతర ప్రాంతాల్లో పని చేస్తూ అక్రమాస్తుల వ్యవహారాల్లో వరుసగా ఏసీబీకి పట్టుబడుతున్నారు. ఇటీవల జిల్లాలో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్‌లోని కీలక బాధ్యతల్లో పని చేస్తున్న కొందరు ఉన్నతాధికారుల స్థిరాస్తులపై , వారి బంధువుల ఇళ్లపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు.
● రవాణాశాఖలో పనిచేస్తున్న ఓ ఉన్నతాధికారి ఇళ్లల్లో ఏసీబీ అధికారులు సోదాలు చేసి జిల్లా కేంద్రంలో భారీగా స్థిరాస్తులను గుర్తించారు. బైపాస్ రోడ్‌లో ఓ హోటల్, ఇంటీరియల్ దుకాణానికి సంబంధించి భూమి ఉన్నట్లు విచారణలో తేలింది. అలాగే ఓ బడా కాంట్రాక్టర్‌తో కలిసి కొన్ని అపార్ట్‌మెంట్లలో పెట్టుబడులు పెట్టినట్లు అధికారులు గుర్తించారు.
● హైదరాబాద్‌లోని జలమండలిలో పని చేసిన ఓ ఉన్నతాధికారిని ఇటీవల ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఆయనకు సంబంధించి నవీపేట మండలంలో 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నట్లు అధికారుల విచారణలో తేలింది.
● తాజాగా మోహన్ నాయక్ ఇళ్లపై సోదాలు జరగడంతో ఏసీబీ దాడుల కలకలం రేగింది. ఇతర ప్రాంతాల్లో అక్రమార్జనకు పాల్పడి జిల్లాలో స్థిరాస్తులు కూడబెట్టుకోవడం వెలుగులోకి రావడంతో చర్చనీయాంశంగా మారింది.
అనేక స్థిరాస్తులు..?
ఆర్‌అండ్‌బీ శాఖలో కీలక బాధ్యతల్లో ఉండి అనేక అక్రమాలకు పాల్పడినట్లు మోహన్ నాయక్‌పై ఫిర్యాదులు రావడంతో ఏసీబీ మెరుపు దాడులు చేసింది. సొంత జిల్లాలోనే స్థిరాస్తులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. మోపాల్, డిచ్‌పల్లి మండలాల పరిధిలో సుమారు 30 ఎకరాల వరకు వ్యవసాయ భూమి ఉన్నట్లు తేలింది. కులాస్‌పూర్ తండాలో ఫామ్‌హౌస్ ఉంది. దానికి ఆనుకుని ఎకరం స్థలంలో నూతనంగా ఇంటి నిర్మాణం చేపట్టేందుకు ఇటీవల పనులు ప్రారంభించారు. ఇటీవల కులాస్‌పూర్ తండా సమీపంలో రూ.6 కోట్లతో 9 ఎకరాల విలువైన భూమి కొనుగోలు చేసినట్లు తెలిసింది. దీనిపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అదేవిధంగా నగరంలోని బైపాస్ రోడ్‌లో ఓ వెంచర్‌లో రూ.కోట్లు విలువ చేసే విల్లాను కొనుగోలు చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. గత ప్రభుత్వ హయాంలో తన సన్నిహితుడైన కాంట్రాక్టర్ పేరుతో పనులు చేయకున్నా..భారీగా బిల్లులు పొంది అక్రమార్జన చేపట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి.
జిల్లాకు చెందిన ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ
మోహన్ నాయక్ ఇళ్లలో సోదాలు
ఆయన బంధువులు, బినామీల
ఇళ్లల్లోనూ విస్తృత తనిఖీలు..
ఐదు బృందాలుగా ఏర్పడి
ఏకకాలంలో దాడులు
భారీగా అక్రమాస్తుల గుర్తింపు


