ప్రత్యామ్నాయాల వైపు మళ్లాలంటే..
● ప్రత్యామ్నాయ పంటలపై
ఆసక్తి చూపని రైతాంగం
● 3.20 లక్షల ఎకరాల్లో
నాట్లు వేస్తారని అంచనా
దేశంలో వరి ధాన్యం అధిక ఉత్పత్తితో నిల్వ సమస్యలు ఎదురవుతున్నాయి. దీనిని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం వరిని అత్యధికంగా పండిస్తున్న రాష్ట్రాలలో ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. వరికి బదులుగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు వంటి పంటలు సాగు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అయితే రైతులు మాత్రం దీనికి సుముఖంగా లేరు. జిల్లాలో వానాకాలం సీజన్‌లో 5.59 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగవుతాయని అధికారులు అంచనా వేయగా.. ఇందులో వరి ఒక్కటే 3.20 లక్షల ఎకరాల్లో సాగవనుంది.
నిరాసక్తతకు కారణాలు..
● ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి వరి పంటను కనీస మద్దతు ధరకు కొనుగోలు చేస్తోంది. కానీ ఇతర పంటలకు ఆ భరోసా లేదు.
● పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయల ధరలు తరచూ మారుతుంటాయి. పంట చేతికొచ్చే సమయంలో ధరలు తగ్గితే నష్టపోవాల్సి వస్తుంది. దీనికితోడు నిల్వ చేసుకుందామంటే గోదాముల సమస్య. ఆయా పంటలకు సరైన మార్కెటింగ్ సౌకర్యాలూ లేవు.
● ప్రత్యామ్నాయాలపై రైతులకు సరైన అవగాహన లేదు. కొత్త పంటలతో ప్రయోగాలు చేసే బదులు వరి సాగే సురక్షితమైన ఎంపికగా భావిస్తున్నారు. నేల స్వభావం కూడా వరికే అనువుగా ఉంటుందంటున్నారు.
ప్రత్యామ్నాయ పంటలు వేసే రైతులకు ప్రోత్సాహకాలు అందించాలి.
నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచాలి. పప్పు ధాన్యాలు, నూనె గింజలు, కూరగాయలకు సంబంధించి నాణ్యమైన విత్తనాలతోపాటు ఎరువులను రాయితీపై అందించాలి.
కనీస మద్దతు ధర కల్పించి, ప్రభుత్వమే కొనుగోలు చేయాలి.
బిందు సేద్యం, తుంపర సేద్యం పరికరాలను ఉచితంగా లేదా భారీ సబ్సిడీపై అందజేయాలి.
అకాల వర్షాలు, ప్రకృతి వైపరీత్యాలు వల్ల పంటలు నష్టపోతే రైతులకు తక్షణమే పరిహారం అందేలా సమర్థవంతమైన బీమా సౌకర్యం కల్పించాలి.
వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని వ్యవసాయ శాఖ అధికారులు సూచిస్తున్నా రైతులు మాత్రం ససేమిరా అంటున్నారు. షరా మామూలుగానే ఈసారీ అత్యధిక విస్తీర్ణంలో వరి సాగుకే మొగ్గు చూపుతున్నారు. – ఎల్లారెడ్డి


