కామారెడ్డి క్రైం: కలెక్టరేట్ సమీపంలో ఉన్న ఈవీఎం గోదాంను కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం సందర్శించారు. గోదాంలోని రికార్డులను పరిశీలించారు. సీసీ కెమెరాల పనితీరు, భద్రతా ఏర్పాట్లను తనిఖీ చేశారు. ఆయన వెంట అదనపు కలెక్టర్ విక్టర్, ఆర్డీవో గిరి, తహసీల్దార్ హిమబిందు, డీటీ రాజేశ్వర్, రాజకీయ పార్టీల ప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు.
కామారెడ్డి అర్బన్: బెస్ట్ అవైలబుల్(రెసిడెన్షియల్, నాన్ రెసిడెన్షియల్) పాఠశాలల్లో ప్రవేశం కోసం దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన ఎస్సీ విద్యార్థులు ఒకటో తరగతినుంచి ఐదో తరగతి వరకు ప్రవేశాల కోసం ఈనెల 19 లోగా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా ఎస్సీ సంక్షేమాధికారి వెంకటేష్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు ఫారాల కోసం కలెక్టరేట్‌లోని 112 గదిలోగల తమ కార్యాలయంలో సంప్రదించాలని, పూర్తి వివరాలకు 94949 82936, 91822 87674 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు.
భిక్కనూరు: వర్షాకాలం ప్రారంభమైనందున వ్యాధులు ప్రబలకుండా గ్రామపంచాయతీ సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి మురళి సూచించారు. మంగళవారం అంతంపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. దోమలు నివారణ చర్యలు చేపట్టాలని, తడి చెత్త పొడి చెత్తపై ప్రజలకు అవగాహన కల్పించాలని సిబ్బందికి సూచించారు. ఇంటిపన్నులను వంద శాతం వసూలు చేయాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ మంజుల సంజీవరెడ్డి, ఉపసర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి భార్గవ్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
కామారెడ్డి టౌన్ : జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయ భవన నిర్మాణానికి ప్రభుత్వం ఎకరం భూమిని కేటాయించింది. ఈ మేరకు కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అడ్లూర్ శివారులోని సర్వే నంబర్ 527/42/1/2 లో గల ఎకరం ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ పార్టీ కి కేటాయించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీనిపై జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మల్లికార్జున్ హర్షం వ్యక్తం చేశారు.
లింగంపేట: గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌కు కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని పంచాయతీరాజ్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ సూచించారు. మంగళవారం ఆయన లింగంపేట మండల పరిషత్ కార్యాలయంలో రికార్డులు పరిశీలించారు. ఎంపీడీవోతో మాట్లాడి అభివృద్ధి పనుల పురోగతిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాగునీరు, పారిశుద్ధ్యం, డ్రెయినేజీ వ్యవస్థ, వీధి దీపాలు, రోడ్లు తదితర మౌలిక సదుపాయాలకోసం నిధులను వినియోగించుకోవాలన్నారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధుల పట్ల ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అనంతరం నాగన్నగారి మెట్ల బావిని సందర్శించారు. ఆయన వెంట డీపీవో మురళి, మండల ప్రత్యేకాధికారి సురేందర్, ఎంపీడీవో నరేష్, ఎంపీవో మలహరి, కార్యదర్శి శ్రావణ్‌కుమార్ తదితరులున్నారు.
నిజామాబాద్ అర్బన్: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ, నీటిపారుదల శాఖల మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బుధవారం జిల్లాకు రానున్నారు. ముందుగా వర్ని మండలంలోని సిద్దాపూర్ రిజర్వాయర్‌ను పరిశీలిస్తారు. అనంతరం జాకోరా గ్రామంలో లిఫ్ట్ ఇరిగేషన్‌ను ప్రారంభించి పబ్లిక్ మీటింగ్‌లో పాల్గొంటారు. మధ్యాహ్నం 12.15 నిమిషాలకు హెలికాప్టర్ ద్వారా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజీకి బయల్దేరి వెళ్తారు.


