ఆయకట్టు గట్టెక్కేనా? | - | Sakshi
Sakshi News home page

ఆయకట్టు గట్టెక్కేనా?

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

సాగర్‌లో నీరున్నా.. ఆయకట్టు గట్టెక్కేనా? మూడు టీఎంసీలు మాయం..

ప్రభుత్వ ఆదేశాల మేరకు..

సాగర్‌లో నీరున్నా..
ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా వరప్రదాయిని అయిన నిజాంసాగర్‌ ప్రాజెక్టులో నీటినిల్వలు ఆశాజనకంగా ఉన్నా.. ఆయకట్టుకు నీటి విడుదలపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్‌ నినో ప్రభావం నేపథ్యంలో నీటిని విడుదల చేస్తారో లేదోనని రైతులు ఆందోళన చెందుతున్నారు. – నిజాంసాగర్‌

ప్రాజెక్టులో 7 టీఎంసీలపైనే నిల్వ

పంటల సాగుపై ఎల్‌ నినో నీలినీడలు

నీటి విడుదలపై స్పష్టత కరువు

ఆందోళనలో రైతులు

నిజాంసాగర్‌ ప్రాజెక్టు కింద ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో ఏటా ఖరీఫ్‌లో సుమారు 1.5 లక్షల ఎకరాలలో పంటలు సాగవుతాయి. ప్రాజెక్టును నమ్ముకుని పలువురు రైతులు బోర్లు, బావుల కింద వానాకాలం పంటల సాగుకు సమాయత్తమయ్యారు. దుక్కులు దున్ని పెట్టుకున్నారు. బాన్సువాడ, నస్రుల్లాబాద్‌, వర్ని, రుద్రూర్‌, ఎడపల్లి, కోటగిరి, బోధన్‌ ప్రాంతాల్లో ఇప్పటికే నారుమళ్లనూ సిద్ధం చేశారు. ఈ నెలాఖరు నుంచి ఆయకట్టు కింద వరి నాట్లు వేయనున్నారు.

ఆందోళన కలిగిస్తున్న ‘వాతావరణ’ం..

వానాకాలం పంటల సాగుకు సమాయత్తం అవుతున్న రైతులను ఎల్‌ నినో ఆందోళనకు గురిచేస్తోంది. ఈసారి జిల్లాలో సాధారణం కన్నా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున బోరుబావులు, ఎత్తిపోతలు, చెరువులు, కుంటలు, ప్రధాన జలాశయాల కింద ముందస్తు పంటలు సాగు చేయవద్దని వాతావరణ శాఖ సూచిస్తోంది. బోరుబావులపై ఆధారపడి పంటలు సాగు చేసినా.. ఒకవేళ వర్షాలు కురియకపోతే పరిస్థితి ఏమిటన్నది రైతులను వేధిస్తోంది. నిజాంసాగర్‌ ప్రాజెక్టులో ప్రస్తుతం 771 టీఎంసీల నీరుంది. అయితే ఇందులో ఆవిరి, లీకేజీల రూపంలో 1.5 టీఎంసీలు తగ్గిపోతాయి. మరో అర టీఎంసీ మేర డెడ్‌స్టోరేజీ ఉంటుంది. ఖరీఫ్‌ పంటలు గట్టెక్కడానికి 9 టీఎంసీల వరకు నీరు అవసరం. దీంతో ప్రాజెక్టులో ఉన్న నీటిని విడుదల చేసినా వర్షాలు కురియకపోతే పంటలు గట్టెక్కడం కష్టమేనన్న అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది. కాగా వర్షాభావ పరిస్థితులు ఏర్పడితే ప్రాజెక్టునుంచి నీటిని విడుదల చేస్తారో లేదోనని సందేహిస్తున్నారు. నీటి విడుదలకు సంబంధించి స్టేట్‌ లెవల్‌ కమిటీ ఫర్‌ వాటర్‌ ప్లానింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ (స్కివమ్‌) కమిటీ ఏ నిర్ణయం తీసుకుంటుందోనని రైతులు ఎదురుచూస్తున్నారు.

నిజాంసాగర్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1,405 అడుగులు (17.8 టీఎంసీలు). అయితే యాసంగి పంటల సాగు సమయంలో నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 1,405 అడుగులు 17.8 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆయకట్టు కింద సుమారు 1.5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేశారు. ఆయకట్టు పంటల అవసరాల కోసం ప్రాజెక్టు 6 విడతల్లో 12.289 టీఎంసీల నీటిని విడుదల చేశారు. కాగా జనవరిలో సింగూరు ప్రాజెక్టు నుంచి 8 టీఎంసీల నీటిని నిజాంసాగర్‌ ప్రాజెక్టుకు విడుదల చేశారు. ఇందులో 4.592 టీఎంసీలు మాత్రమే ప్రాజెక్టును చేరాయి. నిజాంసాగర్‌లో అంతకుముందు ఉన్న నీరు, సింగూరు జలాలు కలిపి 10 టీఎంసీలపైనే నీరుండాలి. కానీ ప్రస్తుతం 7.1 టీఎంసీలు మాత్రమేఉన్నాయి. ప్రాజెక్టు క్యాచ్‌మెంట్‌ ఏరియాలో అక్రమంగా మోటార్లను ఏర్పాటు చేసి జల చౌర్యానికి పాల్పడుతుండడంతోపాటు లీకేజీలు, ఆవిరి రూపంలో సుమారు 3 టీఎంసీలు ఖాళీ అయ్యాయి.

నిజాంసాగర్‌ ఆయకట్టు కింద వానాకాలం పంటల కోసం నీటి విడుదలకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదు. స్కివమ్‌ కమిటీ ఆదేశాల మేరకు నీటి కేటాయింపులు ఉంటాయి. ప్రస్తుతం ఎల్‌ నినో ప్రభావం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ప్రభుత్వ ఆదేశాల మేరకే నీటిని విడుదల చేస్తాం. – కిమ్యానాయక్‌,

నీటిపారుదలశాఖ ఈఈ, నిజాంసాగర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement