అక్రమార్కులపై చర్యలేవీ? | - | Sakshi
Sakshi News home page

అక్రమార్కులపై చర్యలేవీ?

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

ఆధారాలతో చిక్కినా..

కామారెడ్డి టౌన్‌ : కామారెడ్డి మున్సిపల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు సోదాలు జరిపి రెండున్నర నెలలు దాటాయి. పలు అవకతవకలు జరిగినట్లు గుర్తించారు. ఆయా విభాగాల్లో అవినీతి జరిగిందని తేలినా ఇప్పటివరకు ఎవరిపైనా చర్యలు తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది.

కామారెడ్డి బల్దియాలోని పలు విభాగాలపై ఈ ఏడాది మార్చి 16న ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. రోజంతా సోదాలు చేసి పలు విభాగాలలో అవినీతి గుట్టు రట్టు చేశారు. అక్రమాలకు పాల్పడినట్లు ప్రాథమిక ఆధారాలు లభించడంతో 25 మందికిపైగా అధికారులు, సిబ్బందికి నోటీసులు కూడా జారీ చేశారు. అక్రమాలను ప్రభుత్వానికి, సీడీఎంఏకు నివేదించారు. కానీ రెండున్నర నెలలు గడిచినా ఇప్పటికీ బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

అవినీతి జరిగిందని తేలినా...

మున్సిపాలిటీలో అక్రమార్కులు ఏ విభాగాన్నీ వదలకుండా మేసేశారు. టౌన్‌ ప్లానింగ్‌, సానిటేషన్‌, ఇంజినీరింగ్‌, అకౌంట్స్‌.. ఇలా ప్రతిచోటా అవినీతికి పాల్పడ్డారు. నిబంధనలకు విరుద్ధంగా భవన అనుమతులు ఇవ్వడం, ట్రేడ్‌ లైసెన్స్‌ ఫీజులు వసూలు చేయకుండా ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టడం వంటివి తనిఖీల్లో బయటపడ్డాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పట్టణంలోని సుమారు 400 వాణిజ్య సంస్థలు ట్రేడ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌ చేసుకోకపోయినా అధికారులు పట్టించుకోలేదు. ఫలితంగా బల్దియాకు రావాల్సిన రూ. కోటి ఆదాయం పక్కదారి పట్టింది.

శానిటేషన్‌ విభాగంలో డీజిల్‌ బిల్లుల్లో అక్రమాలు జరిగాయని ఏసీబీ అధికారులు గుర్తించారు. మున్సిపల్‌ వాహనాలకు నెలకు రూ. 12.40 లక్షల డీజిల్‌ ఖర్చు చూపిస్తూ, దానికి సంబంధించిన కనీస లాగ్‌ బుక్కులను కూడా నిర్వహించకపోవడం గమనార్హం. పారిశుద్ధ్య విభాగంలో అవుట్‌ సోర్సింగ్‌ సిబ్బంది విధులకు హాజరు కాకపోయినా, వారికి పూర్తి నెల జీతం చెల్లించినట్లు రికార్డులు సృష్టించి ప్రతినెలా రూ. లక్షల్లో నొక్కేసినట్లు తేలింది.

టౌన్‌ ప్లానింగ్‌ విభాగంలో భవన అనుమతుల్లో అవినీతి అక్రమాలు జరిగాయి. పట్టణంలో అక్రమంగా నిర్మించిన 47 భవనాలకు నోటీసులు జారీ చేసి చర్యలు తీసుకోకుండా చేతులు దులుపుకున్నారు. ఈ వ్యవహారంలో భారీగా అవినీతి జరిగినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. డిసెంబర్‌ 2025 నుంచి వచ్చిన 169 భవన నిర్మాణ దరఖాస్తుల్లో 18 అప్లికేషన్లను నిర్ణీత 21 రోజుల గడువు దాటినా పెండింగ్‌లో ఉంచారు. ఈ వ్యవహారంలో దరఖాస్తుదారులను ఇబ్బందులకు గురిచేస్తూ, లంచాల కోసం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేసినట్లు ఏసీబీ గుర్తించింది.

సోదాల సమయంలో సుమారు 18 గంటల పాటు మున్సిపల్‌ కార్యాలయాన్ని తమ అధీనంలోకి తీసుకున్న ఏసీబీ బృందం.. రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి అక్రమాలపై సాక్ష్యాలను సేకరించింది. బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలకు సిఫార్సు చేస్తూ ప్రభుత్వానికి సమగ్ర నివేదికను కూడా సమర్పించారు. దాడులు జరిగి రెండున్నర నెలలు గడుస్తున్నా ప్రభుత్వంనుంచి ఎలాంటి స్పందనలేదు. నోటీసులు అందుకున్న అధికారులు, సిబ్బందిపై శాఖాపరమైన చర్యలు ఎందుకు తీసుకోలేదన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. అవినీతి అధికారులను కాపాడేందుకు ప్రయత్నాలు జరిగినట్లుగా అనుమానిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి ఏసీబీ నివేదిక ఆధారంగా అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

రెండున్నర నెలల క్రితం కామారెడ్డి

బల్దియాలో ఏసీబీ సోదాలు

సానిటేషన్‌, డీజిల్‌ బిల్లులు,

జీతాల్లోనూ అవకతవకల గుర్తింపు

నిబంధనలకు విరుద్ధంగా

భవన అనుమతులు..

బాధ్యులకు నోటీసులతోనే సరి..

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement