కాంట్రాక్టర్ల తిరుగుబాటు! | - | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ల తిరుగుబాటు!

Jun 9 2026 8:28 AM | Updated on Jun 9 2026 8:28 AM

కాంట్రాక్టర్ల తిరుగుబాటు!

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వంపై ఇప్పటికే అధికార కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలే గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వంలో ఉన్నవారితో పాటు కీలక నాయకులు తమను పట్టించుకోవడం లేదని, చివరకు అధికార యంత్రాంగం సైతం చిన్నచూపు చూస్తోందని కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్షేత్రస్థాయిలో గ్రామాల పాలనలో కీలకంగా వ్యవహరిస్తూనే అప్పులు చేసి మరీ పనులు చేస్తున్న సర్పంచ్‌లు, పంచాయతీల పాలకవర్గాలు సైతం ప్రభుత్వం తమను చిన్నచూపు చూస్తోందంటూ ఆవేదన చెందుతున్నారు. అధికార పార్టీలో ఉన్నప్పటికీ బహిరంగంగానే తమ అసహనాన్ని వెలిబుచ్చుతున్నారు. బిల్లులు రాక అప్పుల పాలవుతున్నామని సర్పంచ్‌లు గగ్గోలు పెడుతున్నారు. ఈ క్రమంలోనే చిన్నతరహా, మధ్యతరహా, పెద్దతరహా అభివృద్ధి పనులు చేస్తున్న కాంట్రాక్టర్లూ తమకు బిల్లులు ఇవ్వకపోతుండడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈనెల 18న రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లోని కాంట్రాక్టర్లు చలో హైదరాబాద్‌ కార్యక్రమం చేపట్టారు. 1941లో ఏర్పాటై జాతీయ స్థాయి సంస్థగా ఉన్న ‘బిల్డర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ ఆధ్వర్యంలో ‘మా హక్కు–మా బిల్లులు–రాష్ట్ర అభివృద్ధి’ అనే నినాదంతో చలో హైదరాబాద్‌ కార్యక్రమానికి అన్ని ఉమ్మడి జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం నిజామాబాద్‌లో కాంట్రాక్టర్లు రాష్ట్ర అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సన్నాహక సమావేశంపై మాట్లాడారు. ఇందులో అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, ప్రమోద్‌రెడ్డి, సురేందర్‌రావు, బాగారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, సంజీవరెడ్డి, శ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చలో హైదరాబాద్‌ పోస్టర్‌ విడుదల చేశారు.

పదేళ్లుగా చెల్లింపులు లేవు..

గత పదేళ్లుగా బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా రూ.25 వేల కోట్ల మేర బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు రవీందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి తెలిపారు. కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టి ప్రతి ప్రాంతంలో, పట్టణంలో, గ్రామంలో అభివృద్ధి చూపిస్తున్న తమకు బిల్లులు ఇవ్వకపోవడం భావ్యం కాదన్నారు. కాంట్రాక్టర్లు ఏ పార్టీకి కొమ్ముకాయకుండా ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పటికీ అభివృద్ధి పనులు చేయడమే లక్ష్యంగా ముందుకు వెళుతున్నట్లు పేర్కొన్నారు. తమవద్ద పనిచేస్తున్న వాళ్లకు జీతాలు ఇవ్వలేకపోతుండడంతో పాటు అప్పులకు వడ్డీలు కట్టలేక సతమతమవుతున్నామన్నారు. సర్పంచ్‌ స్థాయి నుంచి క్లాస్‌–1 కాంట్రాక్టర్‌ స్థాయి వరకు బిల్లులు రాక ఆత్మహత్యల దిశగా పలువురు వెళుతున్నారన్నారు. ఇప్పటికే కొందరు ఆత్మహత్యలు చేసుకోగా, మరికొందరు గుండెపోట్లతో మరణించారన్నారు. ఇదిలా ఉండగా ఇతర రాష్ట్రాలకు చెందిన మేఘా, నవయుగ లాంటి బడా కాంట్రాక్టర్లుకు మాత్రం ఎప్పటికప్పుడు వేలకోట్లు చెల్లింపులు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రాష్ట్రంలోని దాదాపు అందరు చిన్న, పెద్ద కాంట్రాక్టర్ల ఆస్తులకు సంబంధించిన పత్రాలు బ్యాంకు తనఖాల్లోనే ఉన్నాయన్నారు. ఇక మున్సిపాలిటీల్లో అయితే అనేక గ్రాంట్లు వస్తున్నప్పటికీ కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు చేయకపోవడం శోచనీయమన్నారు. ఎప్పటికప్పుడు బిల్లులు చెల్లిస్తే మరిన్ని అభివృద్ధి పనులు కాలాతీతం లేకుండా పూర్తి చేస్తామన్నారు. ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్లు రూ.2 లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పనులు చేసే కాంట్రాక్టర్లకు అదే స్థాయిలో ఇబ్బందులు ఉన్నాయన్నారు. ప్రభుత్వం తమపై చిన్నచూపు వదిలేసి బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇదిలా ఉండగా గ్రీన్‌చానల్‌ విధానం అన్ని చెప్పినప్పటికీ అది కూడా ఒకటిరెండు రోజులకే పరిమితం అయిందన్నారు. బిల్లులు ఇవ్వకపోవడంతో ఆస్తులు అమ్ముకుంటున్నామన్నారు. ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించి ఏళ్లతరబడి పెండింగ్‌లో ఉన్న బిల్లులు చెల్లించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రాష్ట్రంలో వేల కోట్ల రూపాయల

బిల్లులు పెండింగ్‌

అప్పులకు వడ్డీలు చెల్లించలేక

పోతున్నాం.. ఆత్మహత్యలే

శరణ్యమవుతున్నాయ్‌..

18న ‘చలో హైదరాబాద్‌’కు

ఇందూరులో సన్నాహక సమావేశం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement