కామారెడ్డి టౌన్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌వో)గా జె.వెంకటి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహిస్తున్న ఆయన బదిలీపై కామారెడ్డికి వచ్చారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇప్పటి వరకు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వోగా విధులు నిర్వహించిన రవీందర్ గౌడ్ ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి ఆర్‌ఎంవోగా తిరిగి విధుల్లో చేరారు.
కామారెడ్డి అర్బన్: జిల్లాలో ఉపాధి హామీ పథకం కింద పనులకు అంచనాలు తయారీ చేసి కలెక్టర్ ద్వారా మంజూరు పొందాలని డీఆర్‌డీవో దామోదర్ ఎంపీడీవోలను ఆదేశించారు. సోమవారం జిల్లాలోని ఎంపీడీవోలు, ఉపాధి హామీ పథకం, హౌసింగ్ అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన బిల్లులను లబ్ధిదారులకు చెల్లించాలన్నారు.
ఎల్లారెడ్డి: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తొలిసారి నిర్వహిస్తున్న తెలంగాణ క్రికెట్ పోటీల్లో (టీజీ–20) జిల్లా యువకుడు విక్రాంత్‌రెడ్డి ఆడబోతున్నారు. ఎల్లారెడ్డికి చెందిన సత్యంరెడ్డి కుమారుడైన విక్రాంత్‌రెడ్డి బ్యాటింగ్ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందారు. ఆయనను వేలంలో అనురాగ్ నల్గొండ నైట్స్ జట్టు ఎంపిక చేసుకుంది. విక్రాంత్‌రెడ్డికి ఎల్లారెడ్డి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకట్రాంరెడ్డి దంపతులతోపాటు కాంగ్రెస్ నాయకులు, క్రికెట్ అభిమానులు అభినందనలు తెలిపారు.
కామారెడ్డి క్రైం: మద్యం సేవించి వాహనాలు నడిపినందుకుగాను జిల్లావ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులు సోమవారం 62 మందికి శిక్షలు విధించాయి. వాహనాల తనిఖీల్లో పట్టుబడిన వారిని ఆయా కోర్టులలో హాజరుపర్చగా ఒకరికి 3 రోజులు, మరొకరికి 2 రోజులు, 8 మందికి ఒకరోజు జైలు శిక్షతో పాటు మొత్తం 33 మందికి కలిపి రూ.73.05 వేలు జరిమానాలను విధించారని ఎస్పీ రాజేశ్ చంద్ర ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్‌ల పరిధిలో క్రమం తప్పకుండా వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చర్యలు తప్పవని హెచ్చరించారు.
కామారెడ్డి క్రైం: విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూ చించారు. సోమ వారం కలెక్టరేట్‌లో జిల్లా స్థాయి ఆహార భద్రత సలహా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పాఠశాలలు, రెసిడెన్షియల్ హాస్టళ్లలో వంటపని చేసే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పరిసరాలు, ఆహార పదార్థాల పరిశుభ్రత పద్ధతులు పాటించాలన్నారు. విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ఆహార భద్రత, విద్య, సంక్షేమ శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఆహార భద్రత జిల్లా అధికారి విక్రమ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
‘కార్పొరేట్’ దుకాణాల్లో
తనిఖీలు చేపట్టాలి
సుభాష్‌నగర్(నిజామాబాద్ అర్బన్): కార్పొరేట్ బంగారు ఆభరణాల దుకాణాల్లో తనిఖీ లు చేపట్టాలని వినియోగదారుల మండలి జాతీయ ప్రధాన కార్యదర్శి సాంబరాజు చక్రపాణి డిమాండ్ చేశారు. ఈ విషయమై సోమవారం లీగల్ మెట్రాలజీ ఇన్‌స్పెక్టర్ సందీప్‌కు వినతిపత్రం ఇచ్చారు. దాడులు నిర్వహించి వినియోగదారుల హక్కులను కాపాడాలని కోరారు.


