● అన్నారంలో రైతుల రాస్తారోకో
● రెండునెలలైనా కొనుగోళ్లు
పూర్తవకపోవడంపై ఆగ్రహం
రామారెడ్డి: వానాకాలం ప్రారంభమైనా వడ్ల కొనుగోళ్లు పూర్తి కాకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. సోమవారం అన్నారంలో రాస్తారోకో చేశారు. ధాన్యం సంచులకు నిప్పు పెట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ గ్రామంలో కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసి రెండు నెలలవుతున్నా కొనుగోళ్లు పూర్తి కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండకు ఎండి ఇప్పటికే భారీగా తరుగు రూపంలో నష్టపోయామని, ఇప్పుడు వానలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నామని పేర్కొన్నారు. ఇప్పటికీ 70 మంది రైతులకు సంబంధించిన ధాన్యం కాంటా కావాల్సి ఉందన్నారు. ధాన్యం సేకరణ నెమ్మదిగా సాగుతోందని గతంలో రోడ్డెక్కినా అధికారులు స్పందించలేదన్నారు. లారీలు సకాలంలో రావడం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని కోరారు.


