మానసిక ఉల్లాసం
● చౌట్‌పల్లిలో విద్యార్థుల యోగా సాధన
● ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్‌లైన్ శిక్షణ
● 13 ఏళ్ల వయస్సులో యోగా
నేర్పుతున్న అనిరుధ్‌గౌడ్
యోగా శిక్షణ ఇస్తున్న అనిరుధ్‌గౌడ్
మోర్తాడ్(బాల్కొండ): ప్రత్యక్ష తరగతులతోపాటు ఆన్‌లైన్‌లో క్లాసులు విని యోగాపై పట్టు సాధించిన 13 ఏళ్ల విద్యార్థి తన తోటి విద్యార్థులకు వేసవి సెలవుల్లో యోగా శిక్షణ ఇస్తున్నాడు. సెలవుల్లో ఏదో ఒక ప్రత్యేక అంశాన్ని నేర్చుకోవాలనే ఆలోచనలో ఉన్న తనతోటి వారికి యోగా శిక్షణ ఇచ్చి మానసిక ఉల్లాసం, సంపూర్ణ ఆరోగ్యం కోసం బాట చూపాడు. అతడే కమ్మర్‌పల్లి మండలం చౌట్‌పల్లికి చెందిన సిలివేరి అనిరుధ్‌గౌడ్. స్థానిక ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి పూర్తి చేసుకున్న అనిరుధ్ తనతోపాటు చదువుకుంటున్న వారికి యోగా శిక్షణ ఇచ్చి మెలకువలను నేర్పిస్తుండడం విశేషం. విద్యార్థులు కూడా తమ వేసవి సెలవులను వృథాగా పోనివ్వకుండా యోగా నేర్చుకోవడంపై దృష్టి సారించి అందరి ప్రశంసలను అందుకుంటున్నారు. రోజూ ఉదయం, సాయంత్రం గంటపాటు ఉన్నత పాఠశాల ఆవరణలో యోగా శిక్షణ తరగతులను అనిరుధ్‌గౌడ్ నిర్వహిస్తున్నాడు.
కరోనా సమయంలో ఆన్‌లైన్‌లో యోగా క్లాస్‌లకు అటెండ్ అయ్యాను. యోగాతో మానసిక ఉల్లాసంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందని తెలుసుకున్న నేను నా తోటి విద్యార్థులకు అదే చెప్పాను. సెలవులు ప్రారంభం కాగానే యోగా శిక్షణ ఇవ్వాలని కోరడంతో రోజూ శిక్షణ ఇస్తున్నా. అందరూ ఉత్సాహంగా శిక్షణలో పాల్గొంటున్నారు. – అనిరుధ్‌గౌడ్, యోగా శిక్షకుడు
యోగా శిక్షణ ద్వారా ఎంతో నేర్చుకున్నాం. యోగా క్లాసులు అనగానే మొదట ఏదో అనుకున్నాం. రెండు మూడు రోజులకే అన్నీ అర్థమయ్యాయి. మా సహచర విద్యార్థి అనిరుధ్ ఇచ్చిన శిక్షణ ఎంతో బాగుంది. యోగాతో ఆరోగ్యం బాగుటుందని తెలుసుకున్నాం.
– రూపేశ్, చౌట్‌పల్లి
యోగా సాధన ద్వారా చదువుపై పట్టు సంపాదించడానికి మార్గం దొరికింది. యోగా శిక్షణ అందరికీ అవసరమే. ఆరోగ్యం, మానసికి ప్రశాంతత ఉంటే మనిషి ఏదైనా సాధించవచ్చు. అది యోగాతోనే సాధ్యమని తెలుసుకున్నాం. ప్రతి సెలవుల్లో యోగా శిక్షణ కార్యక్రమాలు కొనసాగాలి. – శ్రీమై, చౌట్‌పల్లి
అనిరుధ్ ఇచ్చే యోగా శిక్షణ బాగుంది. మాతోటి విద్యార్థి ఎన్నో ఏళ్లుగా యోగాభ్యాసం చేస్తుండటం మాకూ శిక్షణ ఇవ్వడం ఎంతో సంతోషంగా ఉంది. ఉత్సాహంగా రోజూ యోగా క్లాసులకు హాజరవుతున్నాం. మానసికంగా ప్రశాంతత లభిస్తోంది. – అక్షర, చౌట్‌పల్లి


