వర్ని: నిజాంసాగర్ కాలువ ఎగువన ఉన్న నాన్ కమాండ్ ఏరియా వ్యవసాయ భూములకు ఈ ఖరీఫ్‌లో సాగునీరు అందించనున్నట్లు ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. రూ.106 కోట్లతో నిర్మాణం చేపట్టిన జాకోర, చందూర్ లిఫ్ట్‌ల పనులు పూర్తయిన నేపథ్యంలో ఈనెల 10న రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు తెలిపారు. సోమవారం జాకోరాలో లిఫ్ట్ ఇరిగేషన్‌ను, సభాస్థలిని, హెలీప్యాడ్‌న్ ఆయన పరిశీలించారు. జాకోరా లిఫ్ట్ ద్వారా కాలు వ ఎగువ భాగాన ఉన్న 25 వేల ఎకరాలకు, చందూర్ పరిధిలో 10 వేల ఎకరాలకు సాగునీరందించనున్నట్లు వెల్లడించారు. నిజాంసాగర్ ప్రాజెక్టు కింద లక్షా 80 వేల ఎకరాల పంట సాగవుతుందని నాన్ కమాండ్ ఏరియా రైతులకు కూడా సాగునీరు అందించాలనే ఉద్దేశంతో జాకోరా, చందూర్, చింతకుంట లిఫ్ట్‌ల నిర్మాణం చేపట్టినట్లు ఎమ్మెల్యే వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బాన్సువాడ నియోజకవర్గంలో సాగునీరు, విద్య, వైద్య రంగాలకు అధిక నిధులు తీసుకువచ్చి ఆదర్శంగా నిలిచినట్లు వెల్లడించారు. రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, వర్ని మార్కెట్ కమిటీ చైర్మన్ సురేశ్‌బాబా, పీసీసీ డెలిగేట్ రాజిరె డ్డి, తహసీల్దార్ ప్రశాంత్‌కుమార్, ఎంపీడీవో వెంకటేశ్వర్, జాకోరా సొసైటీ చైర్మన్ దశరథ్, సర్పంచ్ సాయిలు నాయకులు, కరణం సాయిరెడ్డి, బారీ, గిరి, వీర్రాజు పాల్గొన్నారు.


