‘మహా’ ఇసుక దోపిడీకి పాతికేళ్లు | - | Sakshi
Sakshi News home page

‘మహా’ ఇసుక దోపిడీకి పాతికేళ్లు

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

‘మహా’ ఇసుక దోపిడీకి పాతికేళ్లు

పటిష్ట చర్యలు తీసుకుంటాం

బోధన్‌: తెలంగాణ, మహారాష్ట్ర మధ్య మంజీర నదిలో ఇసుక తవ్వకాల సరిహద్దు వివాదం 25 ఏళ్లకు పైగా కొనసాగుతోంది. ఇప్పటికీ పరిష్కారానికి నోచుకోవండం లేదు. మహారాష్ట్ర కాంట్రాక్టర్లు హద్దులు దాటి మన భూభాగంలోకి చొరబడి ఇష్టారీతిన ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఫలితంగా ప్రతిఏటా రూ. కోట్ల విలువైన ఇసుక దోపిడీకి గురవుతోంది. తాజాగా సాలూర మండలం హున్సా, మందర్నా గ్రామ శివారులోని మంజీర నదిలో మన భూభాగంలో చొరబడి మహారాష్ట్ర నాందేడ్‌ జిల్లా బిలోలి తాలూకా పరిధిలోని బోలేగాం క్వారీ కాంట్రాక్టర్లు భారీ స్థాయిలో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. హున్సా, మందర్నా గ్రామస్తులు గుర్తించి ఫిర్యాదు చేయగా సాలూర మండల రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లి సర్వే నిర్వహించారు. మన హద్దులో సుమారు 10 ఎకరాల విస్తీర్ణంలో భారీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు చేపట్టినట్టు గుర్తించారు. ఈ నెల 3న మన రెవెన్యూ, పోలీసు అధికారులు బోలేగాం క్వారీలోకి వెళ్లి ఇసుక తవ్వకాలు జరుపుతున్న జేసీబీలను అడ్డుకున్నారు. దీంతో మహారాష్ట్ర గ్రామాల ప్రజలు వాదనకు దిగడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. చివరికి మంజీర నదిలో తెలంగాణ, మహారాష్ట్ర సరిహద్దులను గుర్తించేందుకు జాయింట్‌ సర్వే నిర్వహించాలని ఇరు రాష్ట్రాల అధికారులు అంగీకరించారు. అయితే నిర్ణీత తేదిన జాయింట్‌ సర్వేకు సాలూర మండల రెవెన్యూ అధికారులు, పోలీసులు వెళ్లినప్పటికీ మహారాష్ట్ర అధికారులు హాజరు కాలేదు. దీంతో సరిహద్దుల వివాదం మరోసారి వాయిదా పడింది.

సరిహద్దు గ్రామాలు..

బోధన్‌ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని పోతంగల్‌, సాలూర, బోధన్‌ మండలాల్లోని పోతంగల్‌, సుంకిని, కారేగాం, మందర్నా, హున్సా, ఖాజాపూర్‌, సాలూర, తగ్గేల్లి, కల్దుర్కి, సిద్దాపూర్‌, ఖండ్‌గాం గ్రామాలు మంజీర నది సరిహద్దులో ఉన్నాయి. నదికి అవతలి వైపు నాందేడ్‌ జిల్లాలోని బిలోలి, దెగ్లూర్‌, ధర్మాబాద్‌ తాలూకా పరిధిలోని నాగిని, గంజ్‌గాం, ఎస్గీ, బోలేగాం, సగ్రోలీ, శాకాపూర్‌ మహారాష్ట్ర సరిహద్దు గ్రామాలున్నాయి. గంజ్‌గాం, బోలేగాం, ఎస్గీ, కార్ల, సగ్రోలి ప్రాంతాల్లో ఇసుక క్వారీలకు మహారాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది. గతంలో 2011 నుంచి 2016 వరకు వరుసగా ప్రతి ఏటా హున్సా–మందర్నా, సుంకిని గ్రామస్తులకు మహారాష్ట్ర సరిహద్దు గ్రామస్తులతో సరిహద్దు వివాదం నెలకొంది. జాయింట్‌ సర్వే, ఇసుక తవ్వకాల విషయంలో పలుసార్లు ఘర్షణలు చోటు చేసుకున్నాయి. మంజీరలో ఇసుక తవ్వకాల వల్ల మన భూభాగంలోని తీర ప్రాంత గ్రామాలకు భూర్భజలాల ముప్పు తన్నుకొస్తుంది. నది తీర ప్రాంతంలో సాగు నీటి ప్రాజెక్టులు, చెరువులు లేవు. కరెంట్‌ బోరుబావులే పంట సాగుకు ప్రధాన జలవనరుగా ఉన్నాయి. పలు ఎత్తిపోతల పథకాలు, తాగునీటి పథకాలు మంజీర జలాలపై ఆధారపడి పని చేస్తున్నాయి.

● ప్రస్తుతం మహారాష్ట్రకు చెందిన గంజ్‌గాం, ఎస్గీ, బోలేగాం, సగ్రోలి క్వారీల్లో తవ్వకాలు సాగుతున్నాయి. మంజీర నదిలోని మన హద్దుల్లోకి వచ్చి ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. దీంతో భూగర్భ జలాల సమస్య ఏర్పడుతుందని నది తీరంలోని మన గ్రామాల రైతులు ఆందోళనకు గురవుతున్నారు.

మన భూభాగంలోని మంజీర నదిలో మహారాష్ట్ర కాంట్రాక్టర్ల ఇసుక తవ్వకాల విషయాన్ని ఉన్నతాధికారులకు దృష్టికి తీసుకెళ్తాం. తద్వార ఇసుక తవ్వకాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటాం.

– అజ్మత్‌ నవాజ్‌, సాలూర తహసీల్దార్‌

మంజీరలో ఎడతెగని

సరిహద్దు వివాదం

మన భూభాగంలో తవ్వకాలు

జరుపుతున్న మహారాష్ట్ర కాంట్రాక్టర్లు

జాయింట్‌ సర్వేకూ డుమ్మా కొడుతున్న

పొరుగు రాష్ట్ర అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement