కామారెడ్డి అర్బన్: తెలుగు పంచాంగం ప్రకారం సూర్యుడు వివిధ నక్షత్రాల్లో సంచరించే కాలాలను ఆయా నక్షత్రాల పేరుతో కార్తెలు అని పిలుస్తారు. ఏడాదిలో 27 కార్తెలు వస్తాయి. ఒక్కో కార్తె సుమారు 15 రోజులు ఉంటుంది. అయితే రైతులు మాత్రం వర్షాకాలం ముందు వచ్చే రోహిణితోపాటు వర్షాకాలంలో వచ్చే మృగశిర (మిర్గం), ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, మఖ, పుబ్బ, ఉత్తర, హస్త కార్తెలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆయా కార్తెలను గుర్తు పెట్టుకుని ఆకాశం వైపు ఆశగా చూస్తారు.
మృగశిర కురిస్తే..
రోహిణిలో ఎండకు రోళ్లు పగిలేంతగా ఎండలు కాస్తాయని, ఆ సమయంలో విత్తనాలు వేయొద్దని రైతులు భావిస్తారు. మృగశిర సాధారణంగా జూన్ 8న ప్రారంభమవుతుంది. దీనిని రైతులు పండుగలా జరుపుకుంటారు. వాతావరణం చల్లబడి వర్షాలు కురిసి సాగు పనులు మొదలయ్యే కాలమిది. మృగశిర కురిస్తే ముల్లోకాలు చల్లబడతాయని, ఈ కార్తెలో వర్షం కురిస్తే వచ్చే అయిదు కార్తెలూ వర్షిస్తాయని రైతులు నమ్ముతారు.
ఇంగువ, బెల్లం ప్రసాదం..
ఆరోగ్యం కోసం మిర్గం రోజు ఇంగువ, బెల్లం కలిపి ప్రసాదంలా తీసుకుంటారు. ఈ రెంటిని కలిపి చిన్నచిన్న ముద్దలుగా చేసి పరగడుపున తినడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుందని, రోగ నిరోధక శక్తి పెరుగుతుందని, వాతావరణంలో మార్పులతో ఎదురయ్యే రుగ్మతలనుంచి ఇది కాపాడుతుందని ప్రజలు నమ్ముతారు. వాతావరణంలో వచ్చే మార్పులకు అనుగుణంగా శరీర ఉష్ణోగ్రతలను సమతుల్యం చేయడానికి ఇంగువ, బెల్లం దోహదపడతాయని ఆయుర్వేద వైద్యులు పేర్కొంటున్నారు.
మిర్గంగా పిలుచుకునే మృగశిర కార్తె రోజున భోజనంలో మాంసాహారం తప్పనిసరిగా ఉంటుంది. మృగశిర అనగానే గుర్తుకు వచ్చేది చేపలే.. ఈ కార్తె రోజున చేపలకూర తినడం ఆనవాయితీగా వస్తోంది. మిర్గం రోజు చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని పెద్దలు చెబుతారు. రోహిణి కార్తెలో వేడెక్కిన శరీరం చల్లబడేందుకు పోషక విలువలు పొందేందుకు చేపలు తినాలంటారు. ఉబ్బసంతో బాధపడుతున్నవారికి పలుచోట్ల చేపలమందు వేస్తారు. మృగశిర కార్తె సోమవారం ప్రారంభమవుతుంది. అయినా ఆదివారమే చేపల మార్కెట్లు కళకళలాడాయి.


