తాగు నీటి కోసం నిజాంసాగర్‌ నీటి విడుదల | - | Sakshi
Sakshi News home page

తాగు నీటి కోసం నిజాంసాగర్‌ నీటి విడుదల

Jun 8 2026 6:54 AM | Updated on Jun 8 2026 6:54 AM

తాగు నీటి కోసం నిజాంసాగర్‌ నీటి విడుదల 15న పాఠశాలలు పునఃప్రారంభం రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు 60 మంది ఎంపిక ‘మాన్‌సూన్‌ రెగట్టా’లో బంగారు పతకం

నిజాంసాగర్‌: బోధన్‌ పట్టణ ప్రాంత ప్రజల తాగునీటి అవసరాల కోసం ఆదివారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు. బోధన్‌లోని బెల్లాల్‌ చెరువును నింపనున్నారు. రోజుకు వెయ్యి క్యూసెక్కుల చొప్పున నాలుగు రోజుల పాటు నీరందించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రధాన కాలువ పరిధిలోని డిస్ట్రిబ్యూటరీ తూముల ద్వారా నీటిని విడుదల చేయవద్దని రైతులకు సూచించారు.

ఎల్లారెడ్డి: ఎండల తీవ్రత దృష్ట్యా ప్రభుత్వం వేసవి సెలవులను పొడిగించిందని, ఈనెల 15న పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయని విద్యాశాఖ అధికారులు తెలిపారు. షెడ్యూల్‌ ప్రకారం ఈనెల 12న పాఠశాలలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఎండ తీవ్రతతోపాటు ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం సెలవులు ఉండడంతో సెలవులను పొడిగించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూలై 11న వచ్చే రెండో శనివారాన్ని పనిదినంగా ప్రకటిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.

కామారెడ్డి అర్బన్‌: ఖేలో ఇండియా రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ పోటీలకు ఆదివారం జిల్లా జట్లను ఎంపిక చేశారు. కామారెడ్డి బ్యాడ్మింటన్‌ అకాడమీ ఆధ్వర్యంలో అండర్‌–11, 13, 15, 17, 19 విభాగాలలో బాలబాలికలకు, మాస్టర్స్‌ విభాగంలో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఆయా విభాగాల్లో కలిపి 60 మందిని రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షిప్‌కు ఎంపిక చేశామని జిల్లా బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి సందీప్‌గౌడ్‌ తెలిపారు. రాష్ట్రస్థాయి పోటీలు కేటగిరీలవారీగా ఫిబ్రవరి వరకు ఉంటాయని పేర్కొన్నారు.

భిక్కనూరు: హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో వారం రోజులుగా జరుగుతున్న మాన్‌సూన్‌ రెగట్టా జాతీయ ర్యాంకింగ్‌ సెయిలింగ్‌ చాంపియన్‌షిప్‌లో భిక్కనూరుకు చెందిన రిశ్విత సత్తాచాటింది. ఆదివారం జరిగిన మిక్స్‌డ్‌ డబుల్స్‌ పోటీలో మరో క్రీడాకారుడితో కలిసి రిశ్విత అద్భుత ప్రతిభ చూపి బంగారు పతకం సొంతం చేసుకుంది. రిశ్విత కామారెడ్డిలోని పూలే గురుకుల పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement