● ప్రభుత్వ సంక్షేమ పథకాలను
ప్రజల్లోకి తీసుకువెళ్లాలి
● ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ
కామారెడ్డి టౌన్ : బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీకి బలమైన పునాది లాంటివారని ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ నియోజకవర్గ కార్యాలయంలో ఆదివారం నియోజకవర్గ స్థాయి బీఎల్‌ఏలు, పార్టీ కార్యకర్తల ప్రత్యేక శిక్షణ, సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి బీఎల్‌ఏ తన పరిధిలోని ఓటర్ల వివరాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. ఓటరు జాబితాలో తప్పులు ఉంటే వెంటనే గుర్తించి సరిచేయించాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు వంటి అంశాలపై బీఎల్‌ఏలు ప్రత్యేక దృష్టి సారించాలని ఎంపీ సురేశ్ కుమార్ షెట్కార్ సూచించారు. రాజ్యాంగ పరిరక్షణతో పాటు బీఎల్‌ఏల విధులు, బాధ్యతలు, ఎన్నికల సంఘం నిబంధనలు, డిజిటల్ విధానాల వినియోగంపై మాస్టర్ ట్రైనర్ రోహిత్‌రావు అవగాహన కల్పించారు. కేవలం ఎన్నికల సమయంలోనే కాకుండా ఏడాది పొడవునా ప్రజలతో అనుబంధాన్ని కొనసాగిస్తూ అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా చూడాలని సూచించారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్, డీసీసీ మాజీ అధ్యక్షుడు కై లాస్ శ్రీనివాస్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు సందీప్, శ్రీనివాస్, అంజాద్, లడ్డు, అఖిల, ఫెరోజ్ సుల్తానా, కళ్లెం సావిత్రి, యూనుస్ తదితరులు పాల్గొన్నారు.


