బోధన్: చెస్ (చదరంగం) ఒక ఆటే కాదు.. మెదడుకు మేత వంటిది. మేధో వికాసానికి, విమర్శనాత్మక ఆలోచనకు ఒక చక్కని శిక్షణ. చదువుతోపాటు చదరంగం (చెస్) ఆడటం వల్ల విద్యార్థులలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, సమస్యను పరిష్కరించే నైపుణ్యాలు అద్భుతంగా మెరుగవుతాయని చెస్ సీనియర్ కోచ్‌లు అంటున్నారు. చిన్న వయస్సులో చెస్ నేర్చుకోవడం వల్ల భవిష్యత్తులో వ్యూహకర్తలుగా ఉన్నత స్థాయిలో రాణించేందుకు ఉపయోగకరమని పేర్కొంటున్నారు. ఈక్రమంలో బోధన్ పట్టణంలో ఇటీవల సాయిసామల చెస్ అకాడమీ ద్వారా చిన్నారులకు నెలపాటు చదరంగం ఆటలో శిక్షణ అందించారు.
30 రోజులు.. 44 మంది..
బోధన్ పట్టణానికి చెందిన యువకుడు సాయిబాబా సామల తాను నేర్చుకున్న చెస్ అటను నేటి, భావితరం బాలబాలికలకు అందించాలనే సంకల్పం, సేవాధృక్పథంతో కొత్తగా సాయి సామల చెస్ అకాడమీ ఏర్పాటు చేశారు. తొలిసారి అకాడమీ అధ్వర్యంలో పట్టణంలోని దయానంద్ గోశాల ఆర్యసమాజ్ ప్రాంగణంలో 6 ఏళ్ల వయస్సు పైబడిన బాలబాలికలకు ప్రత్యేకంగా చెస్ సమ్మర్ క్యాంప్‌ను 30 రోజుల పాటు నిర్వహించారు. అకాడమీ నిర్వాహకులు నామ మాత్రపు ఫీజుతో మే 3 నుంచి జూన్ 2 వరకు శిబిరం కొనసాగించారు. డివిజన్ పరిధిలోని పట్టణ పరిసర మండలాలు, గ్రామాలకు చెందిన 44 మంది సమ్మర్‌క్యాంప్‌లో పాల్గొని చెస్‌లో తర్ఫీదు పొందారు. శిబిరం చివరి రోజు నిర్వహించిన ఫైనల్ టోర్నమెంట్‌లో పలువురు చిన్నారులు విశేష ప్రతిభ చాటారు. ముగింపు వేడుకల్లో పలువురు ప్రముఖులు విచ్చేసి, ప్రతిభ చూపిన క్రీడాకారులకు సర్టిఫికెట్లు, బహుమతులు ప్రదానం చేశారు. పట్టణంలో చిన్నారులకు ఇలాంటి శిక్షణ శిబిరం నిర్వహించడంపై పట్టణ ప్రజలు అకాడమీ నిర్వాహకులను అభినందించారు.
బోధన్‌లో సాయిసామల చెస్ అకాడమీ నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు
చెస్ ఆటపై ఆసక్తితో మా గ్రామం నుంచి బోధన్‌లో ఏర్పాటు చేసిన సమ్మర్‌క్యాంప్‌కు వచ్చి శిక్షణ పొందాను. నిర్వాహకులు చాలా సులభమైన పద్ధతుల్లో శిక్షణ ఇచ్చారు. దీంతో ఆటపై మంచి పట్టు రావడంతో ఎంతో పురోగతి సాధించాను.
–ఎంజీ హితేంద్ర, చెస్ క్రీడాకారుడు, గోవూర్, మోస్రా మండలం
చెస్ ఆట నేర్చుకోవడం వల్ల చదువులో రాణించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని గుర్తించాను. 30 రోజుల పాటు సమ్మర్ క్యాంప్‌లో పాల్గొని శిక్షణ పొందాను. ఏ విషయంలోనైనా ముందుగా ఆలోచించడంతోపాటు, సరైన నిర్ణయం తీసుకోవడం నేర్చుకున్నాను. –ఎంఎస్ ధోనీ,
చెస్ క్రీడాకారుడు, బోధన్
నేటి బాలబాలికలు ఎక్కువ సమయం డిజిటల్ వినోదాలకే కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాలలను వా టి నుంచి దృష్టిమళ్లీంచి వా రిలోని సృజనాత్మతకు పదు ను పెట్టాలనే ఆలోచనతో సమ్మర్ క్యాంప్ నిర్వహించాను. విశేష స్పందన లభించింది.
–సాయిబాబా సామల, సాయి సామల చెస్ అకాడమీ కో–ఆర్డినేటర్, కోచ్, బోధన్
విద్యార్థులలో జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెరుగుదలకు తోడ్పాటు
బోధన్‌లో ఇటీవల క్యాంప్
నిర్వహించిన సాయిసామల చెస్ అకాడమీ


