● రూ.95వేలు పోగొట్టుకున్న
బీర్కూర్ యువకుడు
బాన్సువాడ: సైబర్ నేరగాళ్ల మోసంతో ఓ యువకుడు బ్యాంకు ఖాతాలోని రూ.95 వేలు పోగొట్టుకున్నాడు. వివరాలు ఇలా.. బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మజర్ అనే యువకుడు ఆటో డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. ఈ నెల 2న తన వాట్సప్‌కు ఆర్టీఏ చలాన్ పేరుతో ఏపీకే లింక్ వచ్చింది. దీంతో సదరు యువకుడు ఆ లింక్‌ను క్లిక్ చేసి అందులో ఉన్న వివరాలు నమోదు చేశాడు. ఈనెల 3న మజర్ తన బ్యాంకు ఖాతాలో రూ.లక్ష జమ చేశాడు. ఈ నెల 6న విడతల వారీగా 15 నిమిషాల వ్యవధిలో రూ.95 వేలు మాయమయ్యాయి. దీంతో బ్యాలెన్సు చూసుకోగా రూ.95 వేలు డ్రా అయినట్లు చూపించడంతో వెంటనే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 1930 ఫిర్యాదు చేశాడు.
డిచ్‌పల్లి: మండల కేంద్రంలోని బస్టాండ్ సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. డిచ్‌పల్లి ఎస్సై ఆరీఫ్ తెలిపిన వివరాలు ఇలా.. గురుముఖ్ సింగ్ అనే వ్యక్తి తన టీవీఎస్ మోపెడ్‌పై బస్టాండ్ వైపు నుంచి నాగ్‌పూర్ గేట్ వైపు బయలుదేరాడు. బస్టాండ్ సమీపంలో అతడి వాహనాన్ని వెనకనుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. దీంతో గురుముఖ్ కిందపడగా, లారీ టైరు అతడి కాలు పైనుంచి వెళ్లడంతో నుజ్జునుజ్జయింది. స్థానికులు వెంటనే అతడిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు లారీ డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
కమ్మర్‌పల్లి(భీమ్‌గల్): భీమ్‌గల్ మున్సిపల్ పరిధిలోని లింబాద్రిగుట్ట వడ్డెర కాలనీ బ్రాహ్మణకుంట బాధిత కుటుంబాలను ఆదివారం ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి పరామర్శించారు. బ్రాహ్మణకుంటలో ఇటీవల ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తు పడి మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో బాధిత కుటుంబీకులను ఎమ్మెల్యే ఓదార్చి, రూ. 18వేల ఆర్థిక సహాయం అందజేశారు. భీమ్‌గల్ తహసీల్దార్ కిరణ్‌కుమార్, ఎంపీడీవో సంతోష్‌కుమార్‌తోపాటు ఇతర అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయం అందించి ఆదుకోవాలని కోరారు. ప్రమాదానికి కారణమైన బ్రాహ్మణ కుంటను పరిశీలించారు. అధికారులు వెంటనే కుంట చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయడం లేదా కుంటను పూడ్చివేసే చర్యలను పరిశీలించాలని సూచించారు.
తాడ్వాయి(ఎల్లారెడ్డి): తాడ్వాయి మండలానికి చెందిన దమ్మన్నగారి సాయిరెడ్డి(50) కువైట్‌లో మృతిచెందినట్లు గ్రామస్తులు ఆదివారం తెలిపారు. సాయిరెడ్డి బతుకు దెరువు కోసం గత కొన్ని సంవత్సరాలుగా కువైట్ దేశానికి వెళుతున్నాడు. కాగా ఈనెల ఆరవ తేదీన విధినిర్వహణలో ఉండగా ఆకస్మాత్తుగా సాయిరెడ్డికి గుండెపోటు రావడంతో మృతిచెందాడు. ఈవిషయం కుటుంబసభ్యులకు తెలియడంతో రోదనలు మిన్నంటాయి. మృతుడికి భార్య శిరీష, కుమారుడు సుభాన్ రెడ్డి ఉన్నారన్నారు. ప్రభుత్వం స్పందించి సాయిరెడ్డి మృతదేహాన్ని స్వదేశానికి తొందరగా రప్పించాలని కోరారు.


