అప్రమత్తత అవసరం
● దోమల నివారణతో రోగాలు దూరం
● కలుషిత నీటిని తాగొద్దని సూచన
సదాశివనగర్(ఎల్లారెడ్డి): రోగాల సీజన్ ప్రారంభమైంది. తొలకరి వర్షాలు కురియడంతో పుడమి పులకరించింది. సీజనల్ వ్యాధుల కాలం కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఈ కాలంలో ప్రధానంగా కొన్ని రకాలైన వ్యాధులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సిన అవసరం ఉంది. దోమలతో మలేరియా, డెంగీ, నీటి కాలుష్యంతో డయేరియా, కామెర్లు, వైరల్ జ్వరాలు పిల్లల్లో మజిల్స్, గదవ బిల్లలు, చికెన్‌ఫాక్స్ లాంటి వ్యాధులు వచ్చే ఆస్కారం ఉంది. కోవిడ్ వచ్చిన సమయంలో సాధారణ వ్యాధులు ప్రజలకు ఆటంకం కలిగించకపోయినా ప్రస్తుత సీజన్‌లో మరి కాస్త అప్రమత్తంగా ఉంటే ఆ వ్యాధుల నుంచి బయటపడే ఆస్కారం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు.
డెంగీ, మలేరియాతో జాగ్రత్త...
ముఖ్యంగా అపరిశుభ్ర పరిసరాలు, ఓపెన్ నాళాలు, మురుగు నిల్వ ఉన్నచోట దోమలు పెరిగే అవకాశం ఉంది. రోడ్ల వెంబడి వ్యర్థ పదార్థాలను పడేయడం వల్ల మురికి కూపాలుగా మారుతున్నాయి. మలేరియా లక్షణాలు కనిపిస్తే వెంటనే రక్త పరీక్షలను నిర్వహించి వ్యాధి నిర్ధారించి చికిత్స అందించాల్సి ఉంటుంది. లేదంటే మలేరియా మూత్ర పిండాలు, కాలేయం, రక్త కణాలను దెబ్బతీస్తుంది. ఒక్కోసారి మెదడుపై ప్రభావం చూపి కోమాలోకి వెళ్లే ఆస్కారం ఉంటుంది. నల్లగా ఉండే డెంగీ దోమ ఒంటిపై తెల్లని చారలు ఉంటాయి. అందుకే దీన్ని టైగర్ దోమగా పిలుస్తారు. ఇది కుట్టిన ఏడు నుంచి 8 రోజుల తర్వాత డెంగీ లక్షణాలు కనిపిస్తాయి. హఠాత్తుగా తీవ్ర జ్వరం, కాళ్లు కదిలించలేని పరిస్థితి, భరించలేని కండరాల నొప్పి, వాంతులు వికారంగా రక్తంతో కూడిన మల విసర్జన, కడుపునొప్పి ఉంటాయి. రక్తపోటుతో పాటు రక్తకణాల సంఖ్య పడిపోతుంది. ఫలితంగా అన్ని అవయవాలు పని చేయక ప్రాణాపాయం సంభవించే ప్రమాదం ఉంటుంది. ఇక మలేరియా, డెంగీ, చికెన్ ఫ్యాక్స్ వస్తే తీవ్రమైన తలనొప్పి, చలి జ్వరం, ఒక్కసారిగా అధిక జ్వరం, శరీరంపై దద్దుర్లు, ఒళ్లునొప్పులు, పార్శపునొప్పి, కీళ్ల నొప్పులు వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. కలుషిత నీరు తాగడం వల్ల కలరా, డయేరియా, పచ్చకామెర్లు వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది.
సీజనల్ వ్యాధులు ప్రభలే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ప్రధానంగా నీరు కలుషితం కాకుండా చూసుకోవాలి. ఎక్కువగా నీటి ద్వారానే వ్యాధులు వ్యాప్తి చెందే ఆస్కారం ఉంది. మురికి నీరు ప్రవహించక ఒక్క చోట నిల్వ ఉండడం వల్ల దోమల ఉధృతి పెరుగుతుంది. దీంతో వైరల్ జ్వరాలు వచ్చేందుకు అవకాశం ఉంది. – ఆస్మాఅప్షిన్,
వైద్యాధికారిణి, పీహెచ్‌సీ, సదాశివనగర్
సాధారణంగా ఏదైనా వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స తీసుకోవడం కంటే ముందస్తు జాగ్రత్తలతో రోగాలు సోకకుండా నియంత్రించవచ్చని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. గ్రామాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. దోమకాటు బారిన పడకుండా కాళ్లు చేతులు పూర్తిగా కప్పి ఉండే దుస్తులు వేసుకోవాలి. కూలర్లు, పూలకుండీలు, నీటి డ్రమ్ములు, వాటర్ ట్యాంక్‌ల్లో లార్వా పెరుగుతుంది. వీటిలో నీటిని ఎప్పటికప్పుడు మార్చుతూ ఉండాలి. సంపులు, ట్యాంక్‌లపై మూతలు ఉండేలా చర్యలు తీసుకోవాలి.


