ఆర్యక్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు | - | Sakshi
Sakshi News home page

ఆర్యక్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

Jun 7 2026 8:06 AM | Updated on Jun 7 2026 8:06 AM

ఆర్యక్షత్రియ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు ‘ముదిరాజ్‌లు ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలి’ ట్రాఫిక్‌ నిబంధనలు తప్పక పాటించాలి అభివృద్ధికి సహకరించండి బడిబాటపై పాట ఆవిష్కరణ

కామారెడ్డి అర్బన్‌/కామారెడ్డిటౌన్‌: ఛత్రపతి టీచర్స్‌ సొసైటీ ఆధ్వర్యంలో పదవ తరగతి, ఇంటర్‌, మెడిసిన్‌, ఇంజనీరింగ్‌ ఉన్నత విద్యాకోర్సుల్లో సీటు పొందిన విద్యార్థులతో పాటు, వివిధ శాఖల్లో ఉద్యోగాలు పొందిన ఆర్యక్షత్రియలకు శనివారం ప్రతిభా పురస్కారాలు అందజేశారు. కామారెడ్డి సాందీపని డిగ్రీ కళాశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఛత్రపతి టీచర్స్‌ సొసైటీ అధ్యక్షుడు ఎల్‌.వెంకట కృష్ణారావు, కార్యదర్శి మధు, కోశాధికారి కమలాకర్‌రావు, ఆర్య క్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు నిట్టు వెంకటరావు, పట్టణ అధ్యక్షుడు బాలాజీరావు, ప్రతినిధులు రాజేశ్వరరావు, ఆనంద్‌రావు, దత్తాత్రి, మనోహర్‌రావు, కౌన్సిలర్లు గంగాధర్‌రావు, బి.వినోద తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి అర్బన్‌: ముదిరాజ్‌లు మారుతున్న కాలానికి అనుగుణంగా అవకాశాలను వినియోగించుకొని ఉన్నత చదువులు చదివి స్థిరపడాలని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఇప్ప ఉమారాణి అన్నారు. కామారెడ్డి సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం భవనంలో శనివారం ముదిరాజ్‌ పదవ తరగతి, ఇంటర్‌ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను సన్మానించి ప్రతిభా పురస్కారాలు అందజేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మర్‌ పున్న రాజేశ్వర్‌, ముదిరాజ్‌ సంఘం నాయకులు, కౌన్సిలర్లు కాళ్ల రాజమణి, గణేష్‌, భానుప్రకాష్‌, అరవింద్‌, గంగారాజు, గజ్జల భిక్షపతి, రమేష్‌, లింబాద్రి, తదితరులున్నారు.

పిట్లం(జుక్కల్‌): వాహనదారులు ట్రాఫిక్‌, రోడ్డు భద్రత నిబంధనలను తప్పక పాటించాలని ఎస్సై ఆంజనేయులు సూచించారు. ఆయన శనివారం సిబ్బందితో కలిసి మండలంలో వాహనాల తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాల పత్రాలను పరిశీలించి, ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై, రోడ్డు భద్రత నియమాలు పాటించని వారిపై చర్యలు తీసుకున్నారు. వాహన ధ్రువ పత్రాలు వెంట ఉంచుకోవాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ ధరించాలని, ఫోర్‌ విలర్‌ వాహనదారులు సీట్‌ బెల్ట్‌ ధరించాలని, మైనర్లకు వాహనాలను ఇవ్వకూడదని సూచించారు.

బాన్సువాడ రూరల్‌: గ్రామాభివృద్ధికి సహకరించాలని కోనాపూర్‌ గ్రామ సర్పంచ్‌ ఎల్లగోని కిష్టవ్వ కోరారు. శనివారం గ్రామ పంచాయతీలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గ్రామసభ నిర్వహించారు. పంచాయతీ కార్యదర్శి రాజేష్‌ గ్రామసభ ఉద్దేశాలను వివరించారు. గ్రామంలో మురుగు కాల్వల పరిశుభ్రత, వీధి దీపాల నిర్వహణ, తాగునీటి సరఫరా విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సర్పంచ్‌ కిష్టవ్వ వివరించారు. ఉపసర్పంచ్‌ బంజభూషణం, నాయకులు రాజేశ్వర్‌గౌడ్‌, హన్మాండ్లు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

భిక్కనూరు: పెద్దమల్లారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న శ్రీపురం మంగ రచించిన బడి పాటను ఎంఈవో రాజగంగారెడ్డి శనివారం ఆవిష్కరించారు. మంగ ప్రభుత్వ పాఠశాలల్లో చేరితే కలిగే మేలు, సౌకర్యాల గురించి రచించిన పాట ఎంతో బాగుందని ఆయన కొనియాడారు .తల్లిదండ్రులార ఆలోచించండి మన ఊరి బడిని కాపాడుకుందాం అంటూ ఆమె రచించిన పాట ఆలోచింపజేస్తుందన్నారు. సర్పంచ్‌ సాయగౌడ్‌, హెచ్‌ఎం ప్రసన్నదేవి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement