దోమకొండ పరిధిలో..
బాన్సువాడ పరిధిలో..
రూ.21 వేల భారం..
భూ విలువకు
రాష్ట్ర ప్రభుత్వం పెంచిన భూముల మార్కెట్ విలువలు శుక్రవారం నుంచి అమలులోకి వచ్చాయి. ప్రాంతాన్ని బట్టి 50 నుంచి 120 శాతం వరకు విలువ పెరిగింది. దీంతో సామాన్యులకు భూములు, ప్లాట్ల కొనుగోలు మరింత భారంగా మారింది. – కామారెడ్డి క్రైం
స్థిరాస్తుల మార్కెట్ విలువను ప్రభుత్వం భారీగా పెంచింది. ఎక్కడ చూసినా 50 నుంచి 120 శాతం వరకు విలువ పెరిగింది. అన్ని సబ్‌రిజిస్ట్రార్, తహసీల్దార్ కార్యాలయాల్లో పెరిగిన భూముల విలువ ఆధారంగానే రిజిస్ట్రేషన్‌ల ప్రక్రియ నిర్వహిస్తున్నారు. కాగా సర్కారు నిర్ణయం భూములు, ప్లాట్లు కొనుగోలు చేసేవారికి ఇది అదనపు భారంగా మారింది. ఒక్కో రూపాయి పోగు చేసుకుని ఇంటి స్థలమో, వ్యవసాయ భూమో కొనుగోలు చేయాలని చూస్తున్నవారిని పెరిగిన భూముల విలువ తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది.
జిల్లాలో కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ, దోమకొండ, బిచ్కుందలలో సబ్‌రిజిస్ట్రార్ కార్యాయాలున్నాయి. వీటిలో పాట్లకు సంబంధించిన, జిల్లాలోని అన్ని తహసీల్ కార్యాలయాల్లో వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్‌లు జరుగుతుంటాయి.
ఎల్లారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్రధాన రహదారి వెంట గజం మార్కెట్ విలువ రూ. 2,400 నుంచి రూ. 4,200 కు చేరింది. కాలనీల్లో రూ. 1,300 ఉండగా రూ. 2,300 కు పెంచారు. ఎల్లారెడ్డి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని అన్ని మండల కేంద్రాల్లోనూ ప్లాట్ల మార్కెట్ విలువ 90 శాతం వరకు పెరిగింది. వ్యవసాయ భూముల మార్కెట్ విలువను 50 శాతానికి పైగా పెంచారు.
బిచ్కుంద మున్సిపాలిటీలో రూ. 1,700 ఉన్న గజం మార్కెట్ విలువ తాజాగా రూ. 3 వేలు అయ్యింది. సబ్‌రిజిస్ట్రార్ పరిధిలోని గ్రామాల్లో గజం రూ. 500 నుంచి వెయ్యి రూపాయలకు, ఇతర మండల కేంద్రాల్లో రూ. 1,700 నుంచి రూ. 2,600 లకు పెరిగాయి. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ 50 శాతం వరకు పెరిగింది.
దోమకొండ సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని గ్రామాల్లో గతంలో పాట్ల కనీస ధర గజానికి రూ.300 ఉండగా ప్రస్తుతం రూ. 600 లకు పెరిగింది. ఐదు మండల కేంద్రాల్లో గజానికి కనీస ధర రూ. 600 నుంచి రూ. 900 లకు చేరింది. భిక్కనూరులో ప్రధాన రహదారి వెంట ధర గజానికి రూ. 900 లనుంచి రూ. 1,900 లకు పెంచారు. వ్యవసాయ భూముల మార్కెట్ విలువ ఏరియాను బట్టి 60 శాతం వరకు పెరిగింది.
కామారెడ్డి మున్సిపల్ పరిధిలో ప్లాట్లకు సంబంధించి గతంలో గజం కనీస విలువ రూ. 2,100 గా ఉండగా ఇప్పుడది రూ. 3,200 లకు పెరిగింది. బస్టాండ్, స్టేషన్‌రోడ్ ప్రధాన రహదారుల వెంట ప్లాట్ల విలువ రూ. 17,600 నుంచి రూ. 26,400లకు చేరింది. నిజాంసాగర్ రోడ్డులో ప్రధాన రహదారి వెంట గతంలో గజం విలువ రూ. 5,800 ఉండగా ఇప్పుడు రూ. 8,700 లకు పెరిగింది.
కామారెడ్డి సబ్ రిజిస్ట్రార్ పరిధిలోని మండల కేంద్రాలు, మేజర్ గ్రామపంచాయితీలలో గజం విలువను రూ. 900 నుంచి రూ. వెయ్యికి పెంచారు. మండలం పరిధిలోని వ్యవసాయ భూముల కనీస మార్కెట్ విలువ గతంలో ఎకరానికి రూ. 2.70 లక్షలుగా ఉండేది. ఇప్పుడు రూ. 3,93,750 లకు చేరింది.
బాన్సువాడ మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన రహదారి వెంట గజం ధర రూ. 5,800 ఉండగా తాజా విలువ ప్రకారం రూ. 10,200 అయ్యింది. కాలనీల్లో ఇళ్ల స్థలాలు గజం రూ. 2,400 నుంచి రూ. 5,800 లకు, గ్రామాల్లో ప్లాట్ల విలువ గజం రూ. 500 నుంచి రూ.వెయ్యికి చేరాయి. వ్యవసాయ భూముల విలువ అన్ని మండలాల్లోనూ గతంలో ఉన్నదాని కంటే 60 శాతం వరకు పెరగడ గమనార్హం.
ఇటీవల ఎకరం భూమి కొన్నా. గురువారం స్లాట్ బుక్ చేసినప్పుడు రూ. 29,600 చెల్లించాను. శుక్రవారం రిజిస్ట్రేషన్‌కు వెళ్తే భూముల విలువ పెరిగిందన్నరు. అదనంగా రూ. 21 వేలు వసూలు చేశారు. ఒక్క రోజులో రూ. 21 వేల భారం పడింది.
– వనం గంగాధర్, బాన్సువాడ
వ్యవసాయ భూముల మార్కెట్ విలువపై 50 శాతం పెంపు
ఇతర స్థలాలపై
120 శాతం వరకు..
అమలులోకి వచ్చిన స్థిరాస్తుల
రిజిస్ట్రేషన్ల మార్కెట్ విలువ
స్థిరాస్తులు కొనేవారిపై
అదనపు భారం


