ఏకరూపం.. తీవ్ర జాప్యం! | - | Sakshi
Sakshi News home page

ఏకరూపం.. తీవ్ర జాప్యం!

Jun 7 2026 8:00 AM | Updated on Jun 7 2026 8:00 AM

ఏకరూపం.. తీవ్ర జాప్యం! రాగానే పంపిణీ చేస్తాం..

స్పష్టత కరువు

త్వరలో తెరచుకోనున్న స్కూళ్లు

ఇప్పటికీ జిల్లాకు చేరని క్లాత్‌

పాత, చిరిగిన యూనిఫాంతోనే

స్కూళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి

కామారెడ్డి టౌన్‌/బిచ్కుంద : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి ప్రభుత్వం ఏటా పుస్తకాలతోపాటు ఉచితంగా రెండు జతల యూనిఫాం అందిస్తోంది. విద్యార్థుల తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు వీటిని సమకూరుస్తోంది. పాఠశాలలు పునఃప్రారంభం రోజే వీటిని అందించేవారు. ఈసారి ఆ పరిస్థితి కనిపించడం లేదు. విద్యాసంవత్సరం పునఃప్రారంభానికి వారం రోజులే సమయం ఉంది. ఇప్పటికీ జిల్లాకు క్లాత్‌ రాకపోవడంతో కొత్త విద్యా సంవత్సరంలో విద్యార్థులు పాత, చిరిగిన దుస్తులతోనే బడికి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది.

77,690 మంది విద్యార్థులు..

జిల్లాలో 1,018 ప్రభుత్వ పాఠశాలలు, కేజీబీవీలు, గురుకులాల్లో కలిపి 77,690 మంది విద్యార్థులున్నారు. ఇందులో 37,247 మంది బాలురు, 40,443 మంది బాలికలు ఉన్నారు. వీరందరికీ ఏటా ప్రభుత్వం రెండు జతల ఉచిత యూనిఫాంలను అందిస్తోంది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు యూనిఫాం క్లాత్‌ రాలేదు. ఇప్పుడు క్లాత్‌ వచ్చినా విద్యాసంవత్సరం ప్రారంభం నాటికి కుట్టించడం అసాధ్యం. విద్యార్థుల కొలతలు తీసుకుని, యూనిఫాం కుట్టించడానికి కనీసం నెల రోజుల సమయం పడుతుందని భావిస్తున్నారు.

జిల్లాకు ఎన్ని యూని ఫాంలు కావాలో ప్రభుత్వానికి వివరాలు పంపాం. యూనిఫాంలు ఎప్పుడు వస్తాయనే దానిపై రాష్ట్ర కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం లేదు. దుస్తులు లేదా క్లాత్‌ రాగానే పంపిణీ చేస్తాం. స్కూళ్ల ప్రారంభానికి ముందే వస్తాయని ఆశిస్తున్నాం. ఈసారి కొత్తగా టై, బెల్ట్‌లు, షూలు కూడా వచ్చే అవకాశం ఉంది.

– మల్లికార్జున్‌, డీఈవో, కామారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం కొన్నేళ్లుగా టెస్కో సంస్థ ద్వారా నాణ్యమైన యూనిఫాం వస్త్రాన్ని సేకరించి, వాటిని ఏప్రిల్‌, మే నెలల్లోనే జిల్లాలకు సరఫరా చేస్తూ వస్తోంది. ఆ క్లాత్‌ను మండలాలవారీగా పంపిణీ చేసి మహిళా సంఘాల సభ్యులతో కుట్టించేవారు. దీనివల్ల అటు విద్యార్థులకు సకాలంలో దుస్తులు అందేవి.. ఇటు మహిళా సంఘాలకు ఉపాధి దొరికేది. అయితే ఈసారి ప్రభుత్వం టెస్కోను కాదని ఓ ప్రైవేటు ఏజెన్సీకి ఈ బాధ్యతలు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అందువల్లే క్లాత్‌ సరఫరాలో జాప్యం జరుగుతోందని తెలుస్తోంది. అయితే దీనిపై విద్యాశాఖ అధికారులకూ స్పష్టత లేదు. మరోవైపు యూనిఫాంలు కుట్టడం ద్వారా ఆదాయం సమకూరుతుందని భావించిన మహిళా సంఘాల సభ్యులకూ నిరాశే మిగిలింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement