కామారెడ్డి టౌన్ : పట్టణ సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. ప్రజాపాలన –ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మున్సిపల్ పరిధిలోని 40వ వార్డులో శనివారం వార్డు సభ నిర్వహించారు. కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ వార్డు సభలు ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని పరిష్కరించేందుకు వేదికలుగా నిలుస్తాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతోనే పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, మౌలిక వసతుల అభివృద్ధి, ప్రజా సేవల మెరుగుదల సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబం చెత్తను తడి, పొడి వ్యర్థాలుగా వేరుచేసి మున్సిపాలిటీకి అందించాలని కోరారు. వర్షపు నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణకోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలన్నారు. విద్యుత్‌ను పొదుపుగా వినియోగించాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ గిరి, హౌసింగ్ పీడీ విజయపాల్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ పర్వతాలు, తహసీల్దార్ హిమబిందు, ఆయా శాఖల అధికారులు, వార్డు ప్రజలు పాల్గొన్నారు.


