బాన్సువాడ/బాన్సువాడ రూరల్/పిట్లం: పిట్లం మండలం కిష్టాపూర్ గ్రామానికి చెందిన పండరి అదే మండలంలోని బొల్లక్‌పల్లి శివారులోగల మంజీర బ్రిడ్జి వద్దనున్న ఎల్లమ్మ ఆలయంలో శుక్రవారం పండుగ చేశాడు. అన్నదమ్ములు సాయిలు, రవీందర్‌తో పాటు చెల్లెళ్లు అనిత, సుజాతల కుటుంబ సభ్యులను ఆహ్వానించాడు. అందరూ కలిసి మొక్కలు చెల్లించికుని, సంతోషంగా భోజనాలు చేశారు. సాయంత్రం వేళలో పండరితోపాటు ఆయన కూతురు పావని(15), చెల్లెలు లింగంపేట్ మండలం పర్మల్ల గ్రామానికి చెందిన కొడబోయిన అనిత(40), ఆమె కూతురు శివాని (13), మరో చెల్లి పిట్లం మండలం గోద్మేగాం గ్రామానికి చెందిన సుజాత కుమారుడు భానుప్రసాద్‌తో పాటు మరికొందరు మంజీర నది వద్దకు వెళ్లారు. అక్కడ నదిలో లోతు ఎక్కువగా ఉండడంతో అనిత, శివాని, పావని, భానుప్రసాద్ అదుపుతప్పి పడిపోయారు. ఒడ్డున ఉన్నవారు కేకలు వేయడంతో పండరి తమ్ముడు రవీందర్ పరుగెత్తుకుంటూ వచ్చి నీటిలో మునిగిన అనితతో పాటు శివాని, పావని, భానుప్రసాద్‌లను ఒడ్డుకు చేర్చాడు. అప్పటికే అనిత, శివాని, పావని మరణించారు. భానుప్రసాద్‌తోపాటు ముగ్గురి మృతదేహాలను కుటుంబ సభ్యులు మోసుకుంటూ రోడ్డు వరకు వచ్చి అంబులెన్స్‌లో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భానుప్రసాద్ పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో బాన్సువాడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఓదార్చిన ఆర్డీవో..
నీట మునిగి ముగ్గురు మరణించిన విషయం తెలుసుకున్న బాన్సువాడ ఆర్డీవో రవీందర్‌రెడ్డి.. బాన్సువాడ ఏరియా ఆస్పత్రికి చేరుకుని సంఘటనపై ఆరాతీశారు. మృతుల బంధువులను ఓదార్చారు. భానుప్రసాద్‌కు మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. ప్రమాదానికి సంబంధించిన నివేదికను ప్రభుత్వానికి పంపి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామన్నారు.
మిన్నంటిన రోదనలు..
మంజీర నదిలో ముగ్గురి మరణవార్త తెలుసుకున్న బంధుమిత్రులు బాన్సువాడ ఆస్పత్రికి తరలివచ్చారు. మృతదేహాలను చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. బాన్సువాడ రూరల్ సీఐ తిరుపయ్య కేసు నమోదు చేసుకున్నారు.
లింగంపేట : మంజీర నదిలో మునిగి మరణించిన పర్మళ్ల గ్రామానికి చెందిన కొడబోయిన అనితకు భర్త నర్సింలు, కూతురు శివాని, కుమారుడు భానుప్రసాద్ ఉన్నారు. కూలి పనులు, వ్యవసాయ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. శివాని కామారెడ్డిలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో ఏడో తరగతి, కొడుకు భానుప్రసాద్ పర్మళ్ల ప్రాథమిక పాఠశాలలో నాలుగో తరగతి పూర్తి చేశారు. ఇటీవల పర్మళ్ల గ్రామంలో ఊర పండుగ చేసుకున్నారు. పండుగ అనంతరం నిద్ర కోసం గురువారం రాత్రి పుట్టింటికి (పిట్లం మండలంలోని కిష్టాపూర్)కు వచ్చారు. శుక్రవారం అందరు కలిసి సంతోషంగా ఎల్లమ్మ పండుగ చేసుకుంటుండగా విషాదం చోటు చేసుకుంది. నీట మునిగి తల్లీకూతుళ్లు అనిత(40), శివాని(13) మృతి చెందడంతో పర్మళ్ల గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతురాలు అనిత గ్రామంలో అందరితో కలుపుగోలుగా ఉండేదని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు.


