● తడిసిన ధాన్యాన్ని మిల్లులకు
తరలించాలి
● కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
భిక్కనూరు: ధాన్యం కొనుగోళ్లను ఈనెల 10వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఆదేశించారు. శుక్రవారం ఆయన రామేశ్వర్‌పల్లిలోని కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తడిసిన ధాన్యం బస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గురువారం కురిసిన వర్షానికి కామారెడ్డి డివిజన్ పరిధిలో 800 టన్నుల వడ్లు తడిశాయని గుర్తించామన్నారు. రైతులకు నష్టం కలుగకుండా ఉండేందుకు తడిసిన వడ్లను వెంటనే రైస్‌మిల్లులకు తరలించాలన్నారు. ధాన్యం తరలింపులో జాప్యం జరగకుండా తగినన్ని వాహనాలను అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఆయన శ్రీ సిద్దరామేశ్వర రైస్‌మిల్లులో పారాబాయిల్డ్ రైస్‌మిల్లుల యజమానులతో సమావేశమయ్యారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా వెంటవెంటనే ధాన్యం అన్‌లోడ్ చేయించాలని సూచించారు. సామర్థ్యానికి అనుగుణంగా ధాన్యాన్ని అన్‌లోడ్ చేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిన 14 మంది రైస్‌మిల్లర్ల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి సహకరించకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 4.19 లక్షల టన్నుల వడ్లను కొనుగోలు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ రాణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంధ్రకాంత్‌రెడ్డి, విండో పర్సన్ ఇన్‌చార్జి నాగార్తి భూంరెడ్డి, అదనపు కలెక్టర్ విక్టర్, డీఎస్‌వో వెంకటేశ్వర్లు, డీఎం శ్రీకాంత్, డీసీవో రామ్మోహన్, ఎంపీడీవో రాజ్‌కిరణ్‌రెడ్డి, రైస్‌మిల్లర్లు, కొనుగోలు కేంద్రాల సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.
ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
కామారెడ్డి క్రైం: జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై శుక్రవారం సాయంత్రం మానిటరింగ్ అధికారులు, ఏపీఎంలు, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టరేట్‌లో సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకొస్తున్న ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలన్నారు. కేంద్రాల వద్ద ధాన్యం నిల్వలు పెరగకుండా చూసుకోవాలన్నారు. ధాన్యం సేకరణ వివరాలను వెంటనే ట్యాబ్‌లలో నమోదు చేయాలన్నారు. వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కొనుగోళ్లను వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
జనగణనను పకడ్బందీగా నిర్వహించాలి
కామారెడ్డి క్రైం: జనగణనను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన తన చాంబర్ నుంచి తహసీల్దార్లు, ఆర్డీవోలతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. జనగణన, ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్), భూభారతి అమలు అంశాలపై పలు సూచనలు ఇచ్చారు. సేకరించే సమాచారం ఖచ్చితత్వంతో కూడినదై ఉండేలా సిబ్బందికి అవగాహన కల్పించాలన్నారు. ప్రత్యేక ఓటరు సమగ్ర సవరణలో ఓటరు జాబితాల పరిశీలన, కొత్త ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, చనిపోయిన వారి పేర్ల తొలగింపు అన్నీ పారదర్శకంగా నిర్వహించాలని సూచించారు. ప్రజల నుంచి వచ్చే దరఖాస్తులను సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. భూభారతి రికార్డుల నిర్వహణ, దరఖాస్తుల పరిష్కారం ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు.


