● లేకపోతే గాంధీ భవన్‌లో దీక్ష చేస్తాం
● మీడియా సమావేశంలో
కాంగ్రెస్ సీనియర్ నేతలు
కామారెడ్డి టౌన్ : టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్‌రెడ్డిపై పార్టీ అధిష్టానం సస్పెన్షన్ వేటు వేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు డిమాండ్ చేశారు. లేకపోతే వెయ్యి మంది కార్యకర్తలతో గాంధీ భవన్ ముందు నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పదవులు ఉన్నా లేకున్నా పార్టీ కోసం నాలుగు దశాబ్దాలుగా కష్టపడుతున్న షబ్బీర్ అలీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదన్నారు. బీఆర్‌ఎస్ నుంచి సస్పెన్షన్ గురై మూడేళ్ల క్రితం కాంగ్రెస్‌లో చేరిన నాయకులు కావాలో.. 35 ఏళ్లుగా పార్టీ మారకుండా కష్టపడుతున్న వారు కావాలో అధిష్టానం తేల్చుకోవాలన్నారు. షబ్బీర్ అలీతోపాటు ఇతర నేతలపై గడ్డం చంద్రశేఖర్‌రెడ్డి వర్గం చేసిన ఆరోపణలను నిరూపించాలని డిమాండ్ చేశారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తామని హెచ్చరించారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రకాంత్‌రెడ్డి, నాయకులు శ్రీనివాస్, సందీప్, పాత రాజు, శ్రీనివాస్‌రెడ్డి, రమేష్, అనంతరెడ్డి, సుదర్శన్, బాలరాజ్, సుధాకర్‌రెడ్డి, రాజాగౌడ్, నౌసిలాల్ నాయక్, కౌన్సిలర్లు వాజిద్, షేరు తదితరులు పాల్గొన్నారు.
దోమకొండ: ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడడానికి కృషి చేయాలని జిల్లా ఫారెస్ట్ అధికారి నీరజ్‌కుమార్ సూచించారు. శుక్రవారం మండల కేంద్రంలోని గడికోటలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను వివరించారు. ప్రతి ఒక్కరు ప్లాస్టిక్ వస్తువులకు దూరంగా ఉండాలన్నారు. ప్రతి ఇంట్లో మొక్కలను పెంచాలని సూచించారు. అనంతరం పర్యావరణ పరిరక్షణ గురించి వివిధ పాఠశాలల విద్యార్థులు గీసిన చిత్రాలను ప్రదర్శించారు. పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో గడికోట వారసులు కామినేని అనిల్‌కుమార్, ట్రస్టు మేనేజర్ బాబ్జీ, డివిజనల్ ఫారెస్ట్ అధికారి రామకృష్ణ, సర్పంచ్ నర్సయ్య, ఉపసర్పంచ్ శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ తిర్మల్‌గౌడ్, నాయకులు శేఖర్, సిద్దారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
సుభాష్‌నగర్ : జీజీహెచ్ నిజామాబాద్‌లో తొలిసారి పీటీసీఏ (స్టెంట్) ప్రక్రియ విజయవంతమైంది. కార్డియాలజీ, ప్లాస్టిక్ సర్జరీ విభాగాల్లో తొలిసారిగా నిర్వహించిన క్లిష్టమైన వైద్య, శస్త్రచికిత్సా ప్రక్రియలు విజయవంతమై ఆస్పత్రి చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించాయి. ఈ సందర్భంగా జీజీహెచ్ సూపరింటెండెంట్ నాగమోహన్‌రావ్ తెలిపిన వివరాల ప్రకారం... బురాజీ (65) అనే వ్యక్తి ఇటీవల తీవ్రమైన ఛాతినొప్పితో జీజీహెచ్‌లో చేరారు. పరీక్షించిన వైద్యులు అక్యూట్ మయోకార్డియల్ ఇన్‌ఫ్రక్షన్(గుండెపోటు) వచ్చినట్లు నిర్ధారించారు. వెంటనే కార్డియాలజీ బృందం థ్రాంబోలైసిస్ చేసి రోగికి చికిత్స అందించారు. గురువారం రోగికి యాంజియోగ్రామ్‌లో రైట్ కరోనరీ ఆర్టరీలో తీవ్రమైన బ్లాకేజీ ఉన్నట్లు గుర్తించి కార్డియాలజీ విభాగ వైద్యులు సందీప్, గోపీకృష్ణ, రవికిరణ్ బృందం పీటీసీఏ స్టెంట్ వేశారు. ప్రస్తుతం రోగి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. ఈ సందర్భంగా ఆస్పత్రి సూపరింటెండెంట్ నాగమోహన్, డిప్యూటీ సూపరింటెండెంట్ రాములు కార్డియాలజీ బృందాన్ని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి అందిస్తున్న సహకారంతోనే అత్యాధునిక వైద్య సేవలు జీజీహెచ్‌లో అందుబాటులోకి వచ్చాయని పేర్కొన్నారు. జనరల్ సర్జరీ విభాగాధిపతి విజయ్ కుమార్ నాయకత్వాన్ని, ప్లాస్టిక్ సర్జన్ శివానీ సేవలను వారు ప్రశంసించారు.


