● ఇష్టానుసారంగా ఎజెండా
సిద్ధం చేశారన్న సభ్యులు
● సమావేశం నుంచి వెళ్లిపోయిన చైర్‌పర్సన్
కామారెడ్డి టౌన్ : కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ తీరు మారడం లేదు. తాజాగా శుక్రవారం జరిగిన సమావేశం రసాభాస కావడంతో మున్సిపల్ చైర్‌పర్సన్ మధ్యలోనే వెళ్లిపోయారు. వివరాలిలా ఉన్నాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ ఇప్ప ఉమారాణి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గిరి సమక్షంలో కౌన్సిల్ హాల్‌లో శుక్రవారం ఉదయం 11 గంటలకు సాధారణ సర్వసభ్య సమావేశం ప్రారంభమైంది. ఎజెండా అంశాలపై చర్చించాలని చైర్‌పర్సన్ కోరారు. అయితే ఎజెండాలోని అంశాలను ఏకపక్షంగా, తమకు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఇష్టానుసారంగా సిద్ధం చేశారని కౌన్సిల్ సభ్యులు నిలదీశారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో వార్డుల్లోని సమస్యలను పరిష్కరించాలన్నారు. గత సమావేశంలో చేసిన తీర్మానాల పనుల్లో ఎలాంటి పురోగతి లేదని సభ్యులు మండిపడ్డారు. పట్టణంలో సానిటేషన్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా తయారైందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎజెండా అంశాలతో పాటు వార్డుల వారీగా ఉన్న సమస్యలపై చర్చిద్దామని చైర్‌పర్సన్ నచ్చజెప్పే ప్రయత్నం చేసినా సభ్యులు వినలేదు. సభ్యుల ప్రవర్తనతో అసహనానికి గురైన చైర్‌పర్సన్ సమావేశాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. శ్మశానవాటికల అభివృద్ధితో పాటు, మురికి కాలువల పూడికతీత తదితర కీలక సమస్యలపై ఎలాంటి చర్చ జరగకుండానే సమావేశం వాయిదా పడింది. వారంలోపు శ్మశాన వాటిక అభివృద్ధి అంశంతో పాటు ఇతర సమస్యలపై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని చైర్‌పర్సన్ పేర్కొన్నారు.


